హాంగ్‌కాంగ్‌లో యాపిల్ పత్రిక మూత

గురువారం నాటి చిట్టచివరి ప్రచురణతో హాంగ్‌కాంగ్‌లో యాపిల్ దినపత్రిక మూతపడుతుంది. ఇక్కడ మిగిలిన ప్రజాస్వామ్య అనుకూల పత్రిక ఇదొక్కటే. పాక్షిక స్వయం ప్రతిపత్తి గల హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాల అణచివేతల దిశలో ఈ పత్రికు చెందిన ఐదుగురు ఎడిటర్లు, కార్యనిర్వాహక అధికారులను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. 

అసమ్మతి వ్యక్తీకరణ పేరిట ఇక్కడ గందరగోళానికి దిగితే కుదరదని చైనా అధికార యంత్రాంగం పేర్కొంటోంది. ఈ దిశలోనే ఎడిటర్లను నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపింది. పత్రికకు చెందిన లక్షలాది డాలర్ల ఆస్తులను స్తంభింపచేశారు.

దీనితో ఈ పత్రిక యాజమాన్యపు సంస్థ నెక్ట్ మీడియా పాలకమండలి అత్యయిక భేటీ జరిపింది. తమ ప్రింటు, ఆన్‌లైన్ ప్రచురణలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హాంగ్‌కాంగ్‌లో ప్రస్తుత పరిస్థితి కోణంలో తమ పత్రిక కానీ, తమ ప్రసార సాధనాలు కానీ వెలుగులోకి తెచ్చేందుకు వీల్లేదని తెలిపారు. 

ఈ డైలీని 1995లో పారిశ్రామిక దిగ్గజం జిమ్మి లాయి స్థాపించారు. ఇటీవలి కాలంలో పలు పత్రికలు మూతపడుతూ వచ్చాయి. ఇంతకాలం తమను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు అని, విరమించుకోవడం బాధగానే ఉంది. అయితే ఇంతకు మించి చేసేదేమీ లేదని తెలిసి ఇప్పుడు తుది ఎడిషన్‌తో సెలవు తీసుకుంటున్నామని ఈ డైలీలో తెలిపారు.