ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

ఎపిలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ దాఖలు చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. రెండు రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 
 
అన్ని రాష్ట్రాలూ పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాక.. ఎపి ప్రభుత్వానికి ఎందుకు అనిశ్చితి నెలకొంది అని ప్రశ్నించింది. పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్‌లో తెలపాలని సూచించింది. ప పరీక్షల నిర్వహణలో ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. 
పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఎపి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని ఏపీ మంత్రి అదిమూలపు సురేష్ ప్రకటించారు. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని,  పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు అడిగిందని సురేష్‌ పేర్కొన్నారు.
 
కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షలను రద్దు చేయని ఎపి సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 28 రాష్ట్రాలకుగానూ 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన ఆరు రాష్ట్రాలు కరోనా రెండో ఉధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
నాలుగు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయలేదని తెలిపారు. కాగా, 11వ తరగతి పరీక్షలు సెప్టెంబరులో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.