ఆఫ్ఘన్ లో ఇస్లామిక్ చట్టం… తాలిబాన్ స్పష్టం 

తాము ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నానని నిర్మొహమాటంగా చెబుతూనే,  ఇదే సమయంలో ఆఫ్ఘన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు తాలిబాన్ తమ ఉద్దేశ్యాలను, విధానాలను స్పష్టం చేసింది.

దేశంలో ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మహిళలకు హక్కులు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తెలిపింది. తాలిబాన్‌ నాయకత్వం ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాలిబాన్ ప్రకటన మహిళలు, తాలిబాన్‌కు అనుకూలంగా లేని ప్రభుత్వానికి సమస్యలను పెంచుతున్నదని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు, అమెరికా దళాలు ఇక్కడి నుంచి వైదొలిగిన తర్వాత తాలిబాన్‌ సంస్థ తమ పరిధిని గణనీయంగా పెంచుకుంటుండటం భయాందోళనలకు గురిచేస్తున్నది. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను భవిష్యత్‌లో ఎదుర్కోవలసి వస్తుందని ఆఫ్ఘన్ మహిళలు భయపడుతున్నారు.

తాలిబాన్ పాలనలో గరిష్టంగా మహిళ మరణాలే ఎక్కువగా జరిగినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. మహిళల విద్య, క్రీడలు, సంగీతం మొదలైన వాటిని తాలిబాన్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అదేవిధంగా స్త్రీలు రోడ్డు మీద లేదా ఎక్కడా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు.

తాలిబాన్ ఫండమెంటలిస్టుల సమూహంలో మహిళలను హింసించేవారికి కొరత లేదు. 9/11 దాడుల అనంతరం అమెరికన్ బలగాలు ఆఫ్ఘాన్‌ రావడంతో మహిళల్లో కొంత ఊరట లభించడంతోపాటు బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే హక్కు లభించిందని ప్రజలు సంబురపడ్డారు. అయితే, శాంతి ఒప్పందంలో భాగంగా వచ్చే సెప్టెంబర్‌ 11 నాటికల్లా అమెరికా, నాటో దళాలు పూర్తిగా ఆఫ్ఘాన్‌ నుంచి విరమించుకుంటుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

తాలిబాన్‌ మరోసారి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుండటంతో ప్రజలు నిద్రకు దూరం అవుతున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను తాలిబాన్ ఆక్రమించుకున్నది. గతంలో మాదిరిగా కాబూల్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తాలిబాన్‌ ఉద్దేశంగా ఉన్నది.