అదాని గ్రూప్ లో ఆవిరైపోయిన రూ 1.76 లక్షల కోట్లు!

సోమ‌వారం నుంచి ప్ర‌తి రోజూ ఆదానీ గ్రూప్ షేర్లు ప‌త‌నాన్నే చ‌వి చూశాయి. శుక్ర‌వారం 4 సంస్థ‌ల షేర్లు లోయ‌ర్ స‌ర్క్యూట్‌లో ట్రేడ‌య్యాయి. ఐదో రోజు ఈ షేర్లు 5-5 శాతం ప‌త‌నం అయ్యాయి. దీంతో మొత్తం ఆదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.1,76,615 కోట్ల మేర హ‌రించుకుపోయింది.
 
విదేశీ పెట్టుబ‌డి సంస్థ‌ల పెట్టుబ‌డుల‌పై ఎన్ఎస్‌డీఎల్‌, సెబీ సందేహాలు ఆదానీ గ్రూప్‌కు ఈ వారం పీడ క‌ల‌లే మిగిల్చాయి.ఆదానీ గ్రూప్ షేర్లు ప‌త‌న‌మైనా ఎంట‌ర్ ప్రైజెస్, ఆదానీ పోర్ట్ స్క్రిప్టులు ఐదు శాతం చొప్పున ల‌బ్ధి పొందాయి. మిగ‌తా ఆదానీ టోట‌ల్ గ్యాస్‌, ఆదానీ ప‌వ‌ర్‌, ఆదానీ ట్రాన్సిమిష‌న్‌, ఆదానీ గ్రీన్ ఎన‌ర్జీ ఐదు శాతం చొప్పున డౌన్ అయ్యాయి. ఈ నాలుగు స్క్రిప్టులు ప్ర‌స్తుతం రూ.1200-1300 మ‌ధ్య ట్రేడ‌వుతున్నాయి.
 
 మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రీత్యా ఆదానీ గ్రీన్ ఎన‌ర్జీ పెద్ద కంపెనీగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ సుమారు రూ.2ల‌క్ష‌ల కోట్లు. కానీ ఇప్పుడు అది రూ.1,65,425 కోట్ల‌కు ప‌డిపోయింది. అంటే ఆదానీ గ్రీన్ ఎన‌ర్జీలో రూ. 26,425 కోట్ల మేర‌కు ప‌త‌న‌మైంది.

ఆదానీ గ్రూప్‌లో మూడు విదేశీ పెట్టుబ‌డి సంస్థ‌ల పెట్టుబ‌డుల‌పై సెబీ సందేహాలు వ్య‌క్తం చేస్తున్న‌ది. ఈ పెట్టుబ‌డులు బోగ‌స్ అని తెలిపింది. అబ్దుల్లా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అనే పేర్ల‌తో విదేశీ సంస్థ‌లు పెట్టుబ‌డి పెట్టాయి. మారిష‌స్ రాజ‌ధాని పోర్ట్ లూయిస్‌లోని ఒకే అడ్రస్‌పై ఈ సంస్థ‌ల కార్యాల‌యాలు ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. వీరికి వెబ్‌సైట్లు లేవు. దీంతో ఈ మూడు సంస్థ‌ల పెట్టుబ‌డుల‌ను సెబీ స్తంభింప‌జేసింది.

ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రైన రిల‌య‌న్స్ ముకేశ్‌ అంబానీకి, ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీ సంప‌ద మ‌ధ్య అంత‌రాయం మ‌రింత పెరిగింది. గ‌త వారం ముకేశ్ అంబానీ నిక‌ర సంప‌ద రూ.5.82 ల‌క్ష‌ల కోట్లు. గౌతం ఆదానీ నిక‌ర సంప‌ద రూ.5.48 ల‌క్స‌ల కోట్లు.
 
గ‌త‌వారం రిల‌య‌న్స్ స్టాక్ అక‌స్మాత్‌గా 12-15 శాతం పెరిగింది. ఫ‌లితంగా రిల‌య‌న్స్ ఎం-క్యాప్ రూ.14 ల‌క్ష‌ల కోట్ల‌కు దూసుకెళ్లింది. శుక్ర‌వారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి గౌతం ఆదానీ నిక‌ర సంప‌ద రూ.7.68 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే. ఇది దాదాపు రెట్టింపు. ఈ వారం ప్రారంభం వ‌ర‌కు ఇది రూ.5 ల‌క్ష‌ల కోట్ల లోపే.
 
ఇప్ప‌టికే ఆస్ట్రేలియాలో బొగ్గు గ‌నుల ప్రాజెక్టు స్తంభించి పోయింది. ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద కుబేరుడిగా మారాల‌న్న గౌతం ఆదానీ ల‌క్ష్యం క‌ష్ట సాధ్య‌మ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఆదానీ గ్రూప్ సంస్థ‌లు క‌ష్టాల్లో చిక్కుకోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని విమర్శ‌లు ఉన్నాయి.
 

గ‌త 50 ఏండ్ల‌లో దేశ‌వ్యాప్తంగా ఆరు విమానాశ్ర‌యాల‌ను ఆదానీ గ్రూప్ గెలుచుకున్న‌ది. గ‌త 14 నెల‌ల్లో క‌రోనా వ‌ల్ల విమానాల రాక‌పోక‌లు నిలిచిపోగా, మెయింటెనెన్స్‌, ఖ‌ర్చులు ఆదానీ గ్రూప్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. మున్ముందు కొన్ని నెల‌ల్లో విమానాశ్ర‌యాల్లో క‌ద‌లిక‌లు, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ప‌రిమితం ఉండే అవ‌కాశం ఉంది.