ట్విట్టర్ భారత్ ఎండిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

కొవిడ్ టూల్‌కిట్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు గత నెల 31న ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్  మహేశ్వరిని ప్రశించారని అధికారులు తెలిపారు. అయితే వారు ఇతర వివరాలేమీ వెల్లడించారు. వినియోగదారులు పెట్టే ట్వీట్లను ‘మానుప్యులేటెడ్ ట్వీట్లు’గా పేర్కొనడం వెనుక కంపెనీ పాలసీ గురించి కూడా మహేశ్వరిని పోలీసులు ప్రశ్నించారని వారు తెలిపారు.

‘కాంగ్రెస్ టూల్‌కిట్‌పై బిజెపి నేత సంబీత్ పాత్ర ఉంచిన ట్వీట్‌ను ట్విట్టర్ ‘మానుప్యులేటెడ్ ట్వీట్’ అని ట్యాగ్ చేసిన నేపథ్యంలో పోలీసులు మహేశ్వరిని ఈ విషయంపై ప్రశ్నించారు. కాగా భారత్‌లో ట్విట్టర్ ఎండిని ప్రశ్నించడం కోసం ఢిల్లీ స్పెషల్ పోలీసు సెల్ మే 31న బెంగళూరుకు వెళ్లినట్లు సోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

మరో వైపు నటి స్వరా భాస్కర్, ట్విట్టర్ ఇండియా ఎండి మనీశ్ మహేశ్వరి, ఇతరులపై ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసుపై ఢిల్లీ తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నేపథ్యంలో భారత్‌లో ట్విట్టర్‌కు ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసిన విషయం తెలిసిందే. కొత్త ఐటి నిబంధనల అమలుపై పదేపదే హెచ్చరించనా ట్విట్టర్ పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. 

కాంగ్రెస్ టూల్‌కిట్‌పై బిజెపి నేతల పోస్టులకు ట్విట్టర్ ట్యాగ్ చేసిన మానుప్యులేటెడ్ మీడియా ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు మే 24వ తేదీ సాయంత్రం ఢిల్లీ, గురుగ్రామ్‌లోని ట్విట్టర్ కార్యాలయాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం నెలకొంది.

మరోవంక, ట్విట్టర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు లీగల్‌ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహ్వేశ్వరిని ఆదేశించారు. 

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడి విషయంలో ‘మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు’ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సూఫీ అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా ‘వందేమాతరం, జై శ్రీరాం’ నినాదాలు చేశారని ఆరోపించారు. అయితే, ఈ సంఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు చెబుతున్నారు.

నకిలీ యంత్రాలు విక్రయించారే కోపంతో సదరు వ్యక్తిపై ఆరుగురు దాడి చేశారని, ఇందులో హిందువులు, ముస్లింలు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అయితే, దాడి ఆరోపణలకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. థర్డ్‌ పార్టీ కంటెంట్‌ను కలిగి ఉందని, దాన్ని తొలగించలేదంటూ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఇదే కేసులో పలువురు జర్నలస్టులు, కొందరు నాయకులపై సైతం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇదిలా ఉండగా.. గత నెలలో ఢిల్లీ స్పెషల్‌ పోలీసుల బృందం ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ వ్యవహారంలో మనీశ్‌ మహేశ్వరిని ప్రశ్నించింది.