జెనీవాలో జో బైడెన్, పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం

అగ్రదేశాలు అమెరికా, రష్యాల అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్‌ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం బుధవారం జెనీవా వేదికగా జరిగింది. సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి విరోధ భావన నెలకొనలేదని పుతిన్‌ పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని తెలిపారు. 
 
‘చాలా అంశాల్లో మేం విబేధిస్తాం. అయితే, ఒకరినొకరు అర్థం చేసుకునే, పరస్పరం దగ్గరయ్యే దిశగా ముందడుగు వేశామని భావిస్తున్నా’ అని పుతిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల రాయబారులను తమతమ విధుల్లో చేరేందుకు తాను, బైడెన్‌ అంగీకరించామని వెల్లడించారు. 
రెండు దేశాల మద్య విబేధాలను తొలగించేందుకు, అణ్వాయుధ పరిమితిపై ఒప్పందానికి సంబంధించి చర్చలను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీపైనా చర్చలు జరపాలని నిర్ణయించారు.  ‘చర్చల సమయంలో మా మధ్య ఎలాంటి శత్రు భావం లేదు. అనుకున్న సమయం కన్నా ముందే చర్చలను ముగించాం’ అని చెప్పారు.
రెండు గొప్ప శక్తుల మధ్య భేటీగా ఈ సదస్సును చర్చలకు ముందు బైడెన్‌ అభివర్ణించారు. ముఖాముఖి చర్చలెప్పుడూ మంచిదేనని వ్యాఖ్యానించారు.  గత కొన్ని నెలలుగా ఇరువురు నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చర్చలు ముగిసిన అనంతరం ఇరువురు నేతలు వేర్వేరుగా మీడియా సమావేశంలో పాల్గొనడం విశేషం.
ఇరు దేశాల సంబంధాలపై దాదాపు మూడు  గంటలపాటు వీరు జెనీవా సరస్సు తీరంలో చర్చలు జరిపారు. అలాగే పలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చించిన్నట్లు సమాచారం. జెనీవాలో జరుగుతున్న ఈ సదస్సుకు స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గరు పర్మెలిన్‌ ఇరు దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. మొదటగా బైడెన్‌ రష్యా అధ్యక్షుడికి కరచాలనం చేశారు. అనంతరం ఇరు దేశాల దౌత్యాధికారులతో బైడెన్‌, పుతిన్‌లు సమావేశ మందిరంలోకి వెళ్లారు. 
 
కాగా, అమెరికా అధ్యక్షుడయ్యాక జో బైడెన్‌ తొలిసారి పుతిన్‌తో సమావేశమవడం గమనార్హం. గతంలో బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలోనూ పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్‌ కూడా అదే స్థాయిలో స్పదించారు. ఇలా ప్రత్యర్థులుగా భావిస్తున్న ఇరు దేశాధినేతలు నేడు ముఖాముఖీ సమావేశం కావడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మొదట పుతిన్, ఆ తరువాత బైడెన్‌ చర్చల వివరాలను వేర్వేరుగా మీడియాకు తెలిపారు. సైబర్‌ భద్రత అంశంపై చర్చలు జరపాలని రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పుతిన్‌ వెల్లడించారు. అమెరికాలోని వ్యాపార, ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్స్‌ను రష్యా హ్యాక్‌ చేస్తోందని యూఎస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను పుతిన్‌ ఖండించారు. చర్చల సందర్భంగా మానవ హక్కుల అంశాన్ని, ప్రతిపక్ష నేత నేవల్నీ జైలు శిక్ష విషయాన్ని బైడెన్‌ ప్రస్తావించారని పుతిన్‌ వెల్లడించారు.