హైదరాబాద్ లో అసాధారణంగా కరోనా మృతులు!

గత ఏడాది కాలంగా హైదరాబాద్ నగరంలో మృతుల సంఖ్య అకస్మాత్తుగా భారీగా పెరగడానికి కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడమే కారణమా? ప్రభుత్వం చెబుతున్న కరోనా మృతుల సంఖ్యకు, వాస్తవంగా జరిగిన కరోనా మరణాలకు అసలు సంబంధం లేదా?  సమాచార హక్కు దరఖాస్తు ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థ గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నుండి సేకరించిన నమోదైన మృతుల సంఖ్య ఈ అనుమానాలను రేకెక్తిస్తున్నది. 
 
హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతి ఎక్కువగా లేదని, దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నదని ప్రభుత్వ నేతలు పదే, పదే చెప్పడం తెలిసిందే. అయితే  గ‌డిచిన ఏడాది కాలంగా హైద‌రాబాద్ మ‌హ‌న‌గ‌రంలో మున్సిప‌ల్ శాఖ ద్వారా జారీ చేసిన మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల సంఖ్య‌ 32వేల‌ వరకు ఉండడంతో ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉందో అర్ధం అవుతోంది. 
ఏప్రిల్ 2020 నుంచి మే 2021 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో 32,752 డెత్ స‌ర్టిఫికెట్లు జారీ చేసిన‌ట్లు ఆర్టీఐ సమాచారం స్పష్టం చేస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ‌లో కొవిడ్ ఉధృతి ప్రారంభ‌మ‌య్యింది. దాదాపు మూడు నెలల పాటూ రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ ఏడాది మే 31 వ‌ర‌కు అంటే రాష్ట్రంలో మొద‌టి వేవ్,  సెకండ్ వేవ్ తీవ్రంగా ప్ర‌భావం చూపిన స‌మ‌యం ఇది.
ఈ ఏడాది కాలంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే 32 వేల మంది చ‌నిపోయారంటే నగరం నిజంగా శ‌వాల దిబ్బ‌గా మారింద‌ని స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సంభ‌వించిన మ‌ర‌ణాల సంఖ్య‌ 18,420 ఉండ‌గా, ఈ ఏడాది జనవరి నుంచి  మే వ‌ర‌కు  సంభ‌వించిన మ‌ర‌ణాల సంఖ్య‌ 14,332.
ఈ మరణాలన్నీ కొవిడ్‌ మ‌ర‌ణాలనే విషయం స్ప‌ష్టంగా అర్థమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే గ‌డిచిన ఏడాది కాలంగా కరోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య కేవ‌లం 3257 మాత్ర‌మే ఉందని వైద్యారోగ్యశాఖ నివేదిక‌లు చెప్తున్నాయి. కాని ఏడాది కాలంగా ప్రభుత్వం  జారీ చేసిన డెత్ స‌ర్టిఫికెట్లు 32వేల‌కుపైగా ఉంటే మ‌రి మిగ‌తా మ‌ర‌ణాలు ఎలా సంభ‌వించాయి? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
మొత్తం డెత్ స‌ర్టిఫికెట్ల‌లో కేవ‌లం 10 శాతం మాత్ర‌మే కరోనా  మ‌ర‌ణాలు ఉంటే మిగ‌తా 30 వేల మంది ఎలా చ‌నిపోయారు? ఏ వ్యాదితో చ‌నిపోయారు? కరోనా కంటే భ‌యంక‌ర‌మైన వ్యాది హైద‌రాబాద్‌లో ఏమైనా వ‌చ్చిందా?  వ‌చ్చినా ఇంత‌మందిని పొట్ట‌న పెట్టుకొనే మాయ‌దారి రోగం ఎక్క‌డ‌కు పోయింది? ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోయాయి.