కరోనాకు నిధులు లేవు.. అదనపు కలెక్టర్లకు లగ్జరీ   కార్లా!

కరోనాకు నిధులు లేవు.. అదనపు కలెక్టర్లకు లగ్జరీ   కార్లా!

తెలంగాణ ఖజానా సొమ్మును అధికారులను బుజ్జగించడానికి అడ్డగోలుగా, నేరపూరితంగా కేసీఆర్ ప్రభుత్వం డబ్బు దుబారా చేయడాన్ని బీజేపీ తప్పు పట్టింది. అదనపు కలెక్టర్లు తిరగడానికి 32 కియా కార్నివాల్ లగ్జరీ కార్లు కొనడానికి అక్షరాలా రూ 11 కోట్లు ఖర్చు చేయడాన్ని కేసీఆర్ ఎలా సమర్థించుకుంటారు? అని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు.

ఒక భయంకర మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోన్న వేళ, కోవిడ్ ఖర్చులు భరించలేక కుటుంబాలు అప్పులపాలై చిదిగిపోతోన్న వేళ, కేసీఆర్ ప్రజల సొమ్మును ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని అంటూ ప్రస్తుత పరిష్టితులలో ఇది అసలు ఊహకందని నిర్ణయం అని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ ల వల్ల రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయిందని చెప్పి, అప్పు పరిమితి  పెంచి, కొత్త అప్పులు తేవాలని ఓ వైపు ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు. 

అలాంటి సమయంలో కనీసం ఆర్థిక క్రమశిక్షణ పాటించి, దుబారా ఖర్చులు తగ్గించాలి. ఇలాంటి ఆర్థిక పరిస్థితులున్నప్పుడు కోట్ల రూపాయలను కార్ల కోసం ఖర్చు పెడతారా? అని కృష్ణసాగర రావు నిలదీశారు. అదనపు కలెక్టర్లకు ఈ లగ్జరీ కార్లు ఇచ్చేకంటే ఆ డబ్బుతో కరోనా చికిత్సకు పడకలు ఏర్పాటు చేసి, పేదలకు వైద్య సౌకర్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 

తక్షణం ఈ వాహనాల కొనుగోలు ఆపాలని, ఆ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు. అసలు అదనపు కలెక్టర్లకు భారీ కార్లను ఇచ్చి, వారి ద్వారా ఏ అదనపు లబ్ధి పొందాలనుకుంటున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని నిలదీశారు.

తెలంగాణ ప్రభుత్వం 32 జిల్లాల అదనపు కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలు మంజూరు చేసింది. రవాణా శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆ వాహనాలను ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.