ఏడాది గడచినా సుశాంత్ మృతిపై తేల్చని బీఐ, ఈడీ, ఎన్సీబీలు! 

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గ‌త ఏడాది జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో ఉన్న త‌న ఇంట్లో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెంది ఏడాది గడిచినా,  ఇంకా అత‌ని మ‌ర‌ణం చుట్టు ఉన్న ర‌హ‌స్యాల‌ను సీబీఐ, ఈడీ, ఎన్సీబీలు చేదింపలేక పోయాయి. ముంబై పోలీసులు సుశాంత్ సూసైడ్ చేసుకున్న‌ట్లు పేర్కొన్నా.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు అనేక అనుమానాల‌ను లేవ‌నెత్తాయి. 

2020, జూన్ 28వ తేదీన సుశాంత్ తండ్రి .. త‌న కుమారుడిని హ‌త్య చేసిన‌ట్లు ఓ పోలీసు కేసు న‌మోదు చేశారు. సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్, న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె కుటుంబ‌స‌భ్యులు త‌న కుమారుడిని ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించేలా చేసిన‌ట్లు ఆయ‌న ఫిర్యాదు చేశారు. ఇక సుశాంత్ అకౌంట్ నుంచి రూ 15 కోట్లు బ‌దిలీ అయిన ఘ‌ట‌న‌పై విచార‌ణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ రంగంలోకి దిగింది.

కానీ ముంబై పోలీసులు వారికి స‌హ‌క‌రించ‌లేదు. దీంతో సుశాంత్ మృతి కేసు రాజ‌కీయ జోక్యానికి దారితీసింది. బీహార్ ప్ర‌భుత్వ వ‌త్తిడితో కేంద్ర ప్ర‌భుత్వం సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్ప‌గించింది. 2020,ఆగ‌స్టు 6వ తేదీన రియాతో పాటు మ‌రికొంద‌రిపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ముంబైలో ఉన్న సీబీఐ అధికారులు అనేక మంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ఎయిమ్స్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు కూడా సుశాంత్ మృతి ప‌ట్ల అధ్య‌య‌నం చేశారు. మ‌నీలాండ‌రింగ్ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీకి.. డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌కి వ‌చ్చింది. దీంతో డ్ర‌గ్స్ కేసును ఎన్సీబీకి అప్పగించారు.  సుశాంత్ ఫోన్ డేటా నుంచి ఈడీ సేక‌రించిన స‌మాచారం.. ఎన్సీబీకి అందింది. దాంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు కొంత మంది డ్ర‌గ్ వ్యాపారుల్ని అరెస్టు చేశారు. 

సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా కూడా డ్ర‌గ్స్ వాడిన‌ట్లు తేలింది. ఆమెను కొన్ని రోజుల పాటు జైలులో ఉంచారు. సుశాంత్ మృతి కేసులో ఇంకా విచార‌ణ కొన‌సాగుతోంద‌ని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈడీ అధికారులు ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ విచార‌ణ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఎన్సీబీ అధికారులు కొంద‌ర్ని అరెస్టు చేసినా.. సుశాంత్ మృతికి కార‌ణం మాత్రం మిస్ట‌రీగానే మిగిలిపోయింది.

బాలీవుడ్ స్టార్ సుశాంత్ అనేక హిట్ చిత్రాల్లో న‌టించారు. కేదార్‌నాథ్‌, చిచోరే, సోంచిడియా, ధోనీ లాంటి సినిమాల్లో అత‌ను న‌టించాడు.