బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి మృతిపై అనుమానాలు 

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి చెప్పారు. వెంకటేశ్వరస్వామి ఆరోగ్యంగా ఉన్నారని, రేపు డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు ప్రకటించిన  మరుసటి రోజు మృతి చెందడంపై అనుమానాలున్నాయని తెలిపారు.

వెంకటేశ్వరస్వామి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శివస్వామి ప్రకటించారు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం వ్యవహారం పరిష్కరించే ప్రయత్నాలు మొదలు పెట్టిన పలువురు పీఠాధిపతుల బృందం వారసుల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బ్రహ్మంగారిమఠం గత చరిత్రను సూక్ష్మంగా పరిశీలించడంతో పాటు ఇటీవల వారసులతో చర్చించి సమన్వయం కుదిరేలా ప్రయత్నాలు చేశారు. ఈ చర్చల అనంతరం వారసులు నాలుగు రోజులు గడువు కోరారు. అయినా పీఠం కోసం పోటీపడుతున్న వారి మధ్య సఖ్యత కుదరలేదు.

మరోవంక, బ్రహ్మంగారి మఠం వివాదంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. గొప్ప మఠంపై అనవసర వివాదాలు చేయొద్దని మంత్రి  సూచించారు. ఇంకా వీలునామా దేవాదాయశాఖకు అందలేదని పేర్కొన్నారు. 

ధార్మిక పరిషత్‌ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని, 30 రోజుల ముందు నోటీసులు ఇచ్చి అందరితో చర్చిస్తామని చెప్పారు. క్విక్‌ పర్సన్‌గా కడప అసిస్టెంట్ కమిషనర్‌ను నియమించామని తెలిపారు. మఠాధిపతులు ఇచ్చే నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, 128 మఠాలలోని సభ్యులతో కమిటీ వేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్‌ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది.