ఐసిసి ఈవెంట్లలో 500 పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌

ఐసిసి ఈవెంట్లలో 500 పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌
ప్రతిష్టాత్మక వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముంగిటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అన్ని ఐసిసి ఈవెంట్లలో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా చరిత్రకెక్కాడు. వన్డే, టి20, చాంపియన్స్‌ ట్రోఫీ, టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో విరాట్‌ కోహ్లీ 500కుపైగా పరుగులు చేశాడు. 
 
2019 వన్డే ప్రపంచకప్‌లో 443 రన్స్‌ చేసిన కోహ్లీ, 2011లో 282, 2015లో 305 పరుగులతో కలిపి వన్డే వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు 1,030 పరుగులు చేశాడు. 2012 టి20 ప్రపంచకప్‌లో 185, 2014లో 319, 2016లో 273 పరుగులతో మొత్తం 777 పరుగులు చేశాడు. 2009 చాంపియన్స్‌ ట్రోఫీలో 95 పరుగులు చేసిన కోహ్లీ  2013లో 176, 2017లో 258 పరుగులతో మొత్తం 529 పరుగులు సాధించాడు.
 
ఇక గత రెండేళ్లుగా సాగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ కోహ్లీ 877 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 అర్థసెంచరీలు ఉన్నాయి. దీతో ఐసిసి ఈవెంట్లన్నిటీలో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ రికార్డుకెక్కాడు.

అంతేకాకుండా, అన్ని ఐసిసి ఈవెంట్ల ఫైనల్స్‌ ఆడిన తొలి ఆటగాడిగా మరో ఘనతను అందుకునేందుకు భారత కెప్టెన్‌ అడుగు దూరంలో నిలిచాడు. జూన్‌ 18 నుంచి 23 వరకు ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌ జరిగే మ్యాచ్‌తో కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. 

 
తన సారథ్యంలో 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ను గెలిపించిన కోహ్లీ,  మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు గెలిచిన 2011 ప్రపంచకప్‌ టీమ్‌లో సభ్యుడు. ఆ తర్వాత 2013 చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా, 2014 టి20 ప్రపంచకప్‌ రన్నరప్‌గా, 2007 చాంపియన్స్‌ ట్రోఫీ రన్నరప్‌గా నిలిచిన జట్లలోనూ కోహ్లీ ఉన్నాడు. 
 
మరో 8 రోజుల్లో ప్రారంభమయ్యే ఐసిసి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడితే అన్ని ఐసిసి ఈవెంట్ల ఫైనల్‌ ఆడిన తొలి ప్లేయర్‌గా విరాట్‌ రికార్డుకెక్కుతాడు.