వంద దేశాలకు అమెరికా విరాళంగా 50 కోట్ల టీకాలు! 

వచ్చే ఏడాది నాటికి 100 దేశాలకు 50 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించాలని అగ్ర దేశం అమెరికా భావిస్తోంది. ఈ మేరకు అమెరికా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ ఫైజర్‌-బయోఎన్‌టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. 

పేద దేశాలకు వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచేందుకు మరింత కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నాయి. బ్రిటన్‌లో కార్న్‌వాల్‌లో జూన్‌ 10న ప్రారంభం కానున్న మూడు రోజుల జి-7 శిఖరాగ్ర సమావేశంలో దీనికి సంబంధించిన ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను ధనిక దేశాలు కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీంతో అమెరికాపై ఒత్తిడి పెరగడంతో ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా తన జనాభాలో సగం మందికి పైగా టీకాలు వేయగా, వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. 

బ్రిట‌న్‌కు వెళ్ల‌డానికి ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కే ముందే దీనిపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు బైడెన్ సంకేతం ఇచ్చారు. ప్ర‌పంచం కోసం వ్యాక్సిన్ వ్యూహం ఏమైనా ఉందా అని ప్ర‌శ్నించ‌గా.. నా ద‌గ్గ‌ర ఒక వ్యూహం ఉంది. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను అని ఆయ‌న తెలిపారు. 

ఈ ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యంలో బైడెన్‌తోపాటు ఫైజ‌ర్ సీఈవో ఆల్బ‌ర్ట్ బౌర్లా కూడా ఉండే అవ‌కాశం ఉంది. ఈ వ్యాక్సిన్ల కోసం లాభాలు లేని ధ‌ర‌ను ఫైజ‌ర్‌కు అమెరికా చెల్లించ‌నుంది. వీటిలో 20 కోట్ల‌ను ఈ ఏడాది, 30 కోట్ల‌ను వ‌చ్చే ఏడాది ప్ర‌పంచ దేశాల‌కు పంపిణీ చేయ‌నుంది.