ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో `మలయాళం’పై ఆంక్షలు!

కరోనా పోరులో అహర్నిశలు శ్రమిస్తున్న కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం ఉంది. అటువంటి కేరళ నర్సులనుద్దేశించి ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుప్రతి జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. 

గోవింద్‌ బల్లాబ్‌ పంత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిఐపిఎంఇఆర్‌) నర్సింగ్‌ సిబ్బందికి ఉద్దేనుద్దేశించి కేవలం ఇంగ్లీష్‌, హిందీలో మాత్రమే మాట్లాడాలని, ముఖ్యంగా మలయాళం వినియోగించరాదని ఆ ఆదేశాల్లో పేర్కొనబడి ఉందిపేర్కొన్నారు. 

ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జిప్మేర్‌ ఆసుప్రతిలో నర్సింగ్‌ సిబ్బందిలో 60 శాతం మంది కేరళ నర్సులు విధులు నిర్వహిస్తుండం గమనార్హం. కాగా, ఈ ఉత్తర్వులను కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ తీవ్రంగా ఖండించారు. ‘ప్రజాస్వామ్యంలో తమ నర్సులకు ఇతరులతో మాతృభాషలో మాట్లాడవద్దని ప్రభుత్వమే చెప్పడం..మనస్సును కదిలించింది. ఇది ఆమోద యోగ్యం కాదు. ఇది భారతీయ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’ అని పేర్కొన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు, సహచర ఉద్యోగులను కమ్యూనికేట్‌ చేసే సమయంలో మలయాళం భాషను వినియోగిస్తున్నారని ఫిర్యాదు అందినట్లు జిప్మేర్‌ తెలిపింది. ఎక్కువ మంది ఈ భాష గురించి తెలియక పోవడం వల్ల ఇబ్బందికి గురైతున్నారని, ఈ నేపథ్యంలో హిందీ, ఇంగ్లీష్‌ భాషలను వినియోగించాలని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ నుండి ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపింది.

కాగా, ఇటువంటి అభ్యంతరాలు గతంలో రాలేదని కేరళ నర్సు ఒకరు తెలిపారు. కేవలం ఒక్క రోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తమకు చెప్పారని విస్మయం వ్యక్తం చేశారు. కాగా, ఈ అంశంపై శనివారం రాత్రి ఎయిమ్స్‌, ఇతర ఆసుపత్రుల్లోని కేరళ నర్సింగ్‌ ఆఫీసర్ల ప్రతినిధులు యాక్షన్‌ కమిటీగా ఏర్పడి ఈ ఆర్డర్‌ను ఖండించారు. 

ఈ ఉత్తర్వులు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా క్యాంపెన్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.  దీనిపై మలయాళీ ఉద్యోగులతోపాటు ఇతర నర్సులూ ఆందోళనకు దిగారు. విధులకు రాకుండా నిరసన తెలిపారు. 

కాగా,  ఈ అంశం వివాదాస్పదమవ్వడంతో జిప్మేర్ తన  ఆదేశాలను  ఆదివారం వెనక్కు తీసుకుంది.  ఈ విషయాన్ని ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఆదేశాలు ఢిల్లీ ప్రభుత్వం నుండి కానీ, ఆసుప్రతి  పరిపాలన నుండి కానీ రాలేదని, ఎవరిచ్చారో తెలియదని పేర్కొన్నారు. అయినప్పటికీ ీీఈ సమస్యను సద్దుమణిగేందుకు  ఈ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు.