ఢిల్లీ అన్‌లాక్‌.. స‌రి, భేసి విధానంలో మాల్స్‌, మార్కెట్లు 

ఢిల్లీ అన్‌లాక్‌.. స‌రి, భేసి విధానంలో మాల్స్‌, మార్కెట్లు 

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మెల్ల‌గా బ‌య‌ట‌ప‌డుతున్న ఢిల్లీలో అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ ప్రారంభించారు. దీనికోసం ఢిల్లీలో కాలుష్యాన్ని క‌ట్ట‌డి చేయ‌డానికి ఉప‌యోగించిన విధానాన్నే ఫాలో అవుతున్నారు. మార్కెట్లు, మాల్స్‌ను స‌రి, భేసి విధానంలో తెరుచుకోవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. 

ఇవి కాకుండా సాధార‌ణ దుకాణాల‌ను మాత్రం ప్ర‌తి రోజూ తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. వ‌చ్చే సోమ‌వారం నుంచి ఈ అన్‌లాక్ ప్రారంభ‌మ‌వుతుంది. స‌రి, భేసి విధానం ప్ర‌కారం స‌గం షాపులు ఒక‌రోజు, మిగ‌తా స‌గం షాపులు మ‌రో రోజు తెర‌వాల్సి ఉంటుంది. అత్య‌వ‌స‌ర వ‌స్తువుల దుకాణాలు, మెడిక‌ల్ షాపులు మాత్రం ప్ర‌తి రోజూ తెర‌వ‌చ్చు.

ఇక ప్రైవేటు కార్యాల‌యాలు 50 శాతం సామర్థ్యంతో ప‌ని చేయాలి. ఇంటి నుంచి ప‌ని చేసే వీలుంటే అలాగే కొన‌సాగాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం కేజ్రీవాల్ కోరారు. ప‌బ్లిక్ సెక్టార్ ఆఫీసుల్లో కేట‌గిరీ ఎ ఉద్యోగులు ప్ర‌తి రోజూ ప‌ని చేయాల్సి ఉంటుంది. వారి కింది ఉద్యోగుల్లో మాత్రం 50 శాతమే హాజ‌రు కావాలి.

ఇక ఢిల్లీ మెట్రో కూడా 50 శాతం సామర్థ్యంతో న‌డపాల‌ని నిర్ణ‌యించారు. ప‌రిస్థితులు మెరుగుప‌డిన కొద్దీ మ‌రిన్ని స‌డ‌లింపులు ఉంటాయ‌ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఇక మూడో వేవ్‌కు ఇప్ప‌టి నుంచే తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. దీనికోసం ప్ర‌త్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

కాగా,  తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. వైరస్‌ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులను ప్రకటించారు.
 షాపింగ్‌ కాంప్లెక్స్‌, మాల్స్‌, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్‌, సెలూన్ షాపులు రాష్ట్రవ్యాప్తంగా మూసి ఉంచనున్నారు. కోయంబత్తూర్‌, నీలగిరి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, కరూర్‌, నమక్కల్‌, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మాయిలదుతూరై జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 11 జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సడలింపులుంటాయని ప్రభుత్వం తెలిపింది.