జడ్జీల నియామకంలో సామాజిక వైవిధ్యం పాటించాలి 

హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదనలు పంపించేటప్పుడు సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని  భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎన్వీ రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. అణగారిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, మహిళలు అందరికీ న్యాయవ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థలో మహిళలు, ఇతర వర్గాలకు సమాన ప్రాతినిధ్యం లభించడం లేదని, సామాజిక న్యాయం జరగడం లేదని వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని సీజేఐ రమణ ఈ కీలక ప్రతిపాదన చేశారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో దేశంలోని వివిధ హైకోర్టులు, సబార్డినేట్‌ కోర్టుల పనితీరుపై ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ నిర్వహించారు.

సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే న్యాయవాదుల పేర్లను, వారి పరిధిలోని హైకోర్టు జడ్జిల నియామకాలకు పరిశీలించాలంటూ వివిధ న్యాయవాద సంఘాలు చేసిన విజ్ఞప్తులను కూడా సీజేఐ హైకోర్టు సీజేల ముందు ఉంచారు. దేశంలో న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం న్యాయం అందించేందుకు అడ్డంకిగా మారుతోందని జస్టిస్‌ రమణ విచారం వ్యక్తం చేశారు.

జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్షగా ఆయన చెప్పారు. ఈ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో దేశంలో అత్యంత ఆధునికమైన, సర్వసౌకర్యాలతో కోర్టు సముదాయాలను నిర్మించడం సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో అన్ని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌కు శాశ్వతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ చెప్పారు. మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయకపోతే న్యాయం అందించే విషయంలో కింది కోర్టుల నుంచి అద్భుతాలు ఆశించలేమని హెచ్చరించారు.

అదే విధంగా ఖాళీల భర్తీని కోర్టులు వేగవంతం చేయాలని, ముఖ్యంగా హైకోర్టులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రతి హైకోర్టులో జడ్జిల సంఖ్య, ఖాళీల గురించి ఆయన సమీక్షించారు. మహమ్మారికి గురై అనేకమంది జడ్జిలు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది మరణించడపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, జిల్లాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో డిజిటల్‌ అవగాహనలో ఉన్న వ్యత్యాసాలు న్యాయవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టుల్లో పనిచేస్తున్న వారిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించి ప్రాధాన్యమిస్తూ టీకాలు అందించాలని కొందరు ప్రధాన న్యాయమూర్తులు కోరారు. దీనిపై తాను సంబంధిత సంస్థలతో మాట్లాడతానని సీజేఐ రమణ హామీ ఇచ్చారు.

పెండింగ్‌ కేసులు, జ్యుడీషియల్‌ అకాడమీల పనితీరు కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. తమకు మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల కల్పనలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, బాంబే, పంజాబ్‌-హరియాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సీజేఐ రమణకు విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణ హైకోర్టు మొబైల్‌ వ్యాన్ల ద్వారా వరంగల్‌ వంటి ప్రాంతాల్లో కోర్టు విచారణ జరిపేందుకు చేసిన వినూత్న కృషిని జస్టిస్‌ రమణ ప్రశంసించారు.