లాక్‌డౌన్ ఎత్తివేతపై తొందరొద్దు

కరోనా మహమ్మారిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, రానున్న మూడో ప్రభంజనాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి, నెమ్మదిగా, క్రమంగా సడలింపులకు ప్రయత్నించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) హెచ్చరించింది. దీనికోసం మూడు అంశాల ప్రణాళికను ఐసిఎంఆర్  డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రామ్ భార్గ‌వ  సూచించారు.
 
తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక శాతం మందికి టీకాలు, కొవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణన లోకి తీసుకొని లాక్‌డౌన్ సడలించడానికి నిర్ణయించాలని పేర్కొన్నారు. 
 
వారం మొత్తం మీద కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండడం, ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్న వారిలో అంటే వృద్ధులు, బహుళ రోగాలతో బాధపడి 45 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వారిలో 70 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరగడం, కొవిడ్‌ను అరికట్టడానికి సామూహికంగా ప్రజలు తగిన విధంగా ప్రవర్తించడం తదితర మూడు అంశాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో అన్‌లాక్ ప్రక్రియ చేపట్టవచ్చని వివరించారు.
 
పరీక్షలను పెంచి, జిల్లా స్థాయిలో కంటైన్మెంట్‌లను ఏర్పాటు చేయడం, అంత ప్రభావ వంతంగా ఉండదని చెప్పారు. లాక్‌డౌన్‌లను అత్యంత నెమ్మదిగా సడలించాలని అభిప్రాయ పడ్డారు. కాగా, భార్గవ చెప్పిన సలహాలను ఇప్పటివరకు నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు.
వ్యాక్సినేషన్‌పై ఆయన మాట్లాడుతూ జులై మధ్య నాటికి లేదా ఆగస్టు మొదటి వారం నాటికి దేశంలో రోజుకు కోటి మందికి టీకాలు అందించే అవకాశం ఉందని తెలిపారు. ‘టీకాలకు కొరత లేదు. ప్రస్తుతం దేశంలో అందరూ టీకాలు వేయించుకోవాలని అనుకుంటున్నారు. దేశం మొత్తానికి ఒక్క నెలలో టీకాలు వేయలేము కదా. మన జనాభా అమెరికా జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అందువల్ల కొంత ఓపిక పట్టా’ అని చెప్పారు.

ఇలా ఉండగా, ఏప్రిల్‌ 27 నుంచి మే 3 వరకు దేశ వ్యాప్తంగా 21.39%గా ఉన్న‌ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గింది. మే31 నాటికి దేశవ్యాప్తంగా 344 జిల్లాల్లో ఐదు శాతానికంటే తక్కువ పాజిటివిటీ రేటు రికార్డు అవుతున్న‌ది. గ‌త నెల‌ మొదటి వారంలో ఈ స్థాయి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 92 మాత్రమే. దేశ వ్యాప్తంగా మే7న నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదు కాగా బుధవారానికి 1.32 లక్షలకు తగ్గ‌డం గ‌మ‌నార్హం.