అసెంబ్లీ ఎన్నికలపై 5,6 తేదీల్లో బిజెపి కీలక భేటీలు 

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశాలు ఈ నెల 5, 6 తేదీల్లో జరుగుతాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగే ఈ సమావేశాల్లో రాబోయే శాసన సభల ఎన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహాలతో పాటు కోవిడ్-19పై కూడా చర్చిస్తారు. 

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పార్టీ ప్రారంభించిన ‘సేవా హీ సంఘటన్’ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. అంతేకాకుండా ఇటీవల ముగిసిన శాసన సభ ఎన్నికల్లో పార్టీ పని తీరుపై కూడా చర్చ జరుగుతుంది.

బీజేపీ కీలక నేత ఒకరు ఓ వార్తా సంస్థకు తెలిపిన సమాచారం ప్రకారం, దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ నెల 5, 6 తేదీల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశాలు జరుగుతాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో పార్టీ కార్యకర్తలు చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 

ఇటీవల ముగిసిన శాసన సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై చర్చిస్తారు. 2022లో జరగబోయే శాసన సభల ఎన్నికల్లో పార్టీ అనుసరించవలసిన వ్యూహాలపై చర్చిస్తారు. ఈ వివరాలన్నిటిపైనా క్షుణ్ణంగా సమాచారం తీసుకురావాలని జాతీయ ప్రధాన కార్యదర్శులను బీజేపీ ఆదేశించింది. 

మరీ ముఖ్యంగా త్వరలో శాసన సభ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల బీజేపీ ఇన్‌ఛార్జులు సమగ్ర సమాచారంతో రావాలని తెలిపింది.  షెడ్యూలు ప్రకారం 2022 ప్రారంభంలో  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉన్నాయి.