దక్షిణ కాశ్మీర్‌లోని థ్రాల్ కౌన్సిలర్ రాకేశ్ పండిత్‌ను ఉగ్రవాదులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు శ్రీనగర్‌లో ప్రభుత్వ వసతి, ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించారు.
ఉగ్రవాదులకు పట్టున్న, ఆయన స్వస్థలమైన థ్రాల్‌లో భద్రతా సిబ్బంది లేకుండా బుధవారం పర్యటించారని, ఈ క్రమంలో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. ఘటనలో అతని స్నేహితుడి కుమార్తె సైతం తీవ్రంగా గాయపడిందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఏడాదిలో కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ముగ్గురు కౌన్సిలర్లు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30న ఉగ్రవాదులు సోపోర్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలోకి చొరబడి ఇద్దరు కౌన్సిలర్లతో పాటు ఓ పోలీస్ అధికారి కాల్చి చంపారు.
రాకేశ్ పండిట్ హత్యను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. హత్యపై బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఖండించారు. ఇలాంటి దాడులు బీజేపీ నాయకులను ప్రజలకుసేవ చేయకుండా ఆపలేవన్నారు. పోలీసులు నిందితులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు.
More Stories
నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
సంఘ్ పాటల ద్వారా సామరస్యం