ఎన్‌హెచ్‌ఆర్‌సి  చైర్‌పర్సన్‌గా జస్టిస్ అరుణ్ మిశ్రా

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది సెప్టెంబర్ 3 న ఆయన  సుప్రీం కోర్టు నుంచి పదవీ విరమణ చేశారు.

జస్టిస్ అరుణ్ మిశ్రా 1978 లో న్యాయవాదిగా చేరారు. 1998-99లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అతి పిన్న వయస్కుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 1999 లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

తరువాత ఆయన జూలై 7, 2014 న సుప్రీంకోర్టుగా ఎదిగే ముందు రాజస్థాన్ హైకోర్టు మరియు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2020 సెప్టెంబర్ 3 న సుప్రీంకోర్టు నుండి పదవీ విరమణ చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్‌గా, ఆయన  పదవీకాలం ఐదేళ్లపాటు లేదా 70 ఏళ్లు వచ్చేవరకు, ఏది ముందు వస్తే అప్పటివరకు ఉంటుంది.

జస్టిస్ మిశ్రాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, హరివంష్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సభ్యులుగా గల అత్యున్నత కమిటీ రెండు రోజుల క్రితం ఎంపిక చేసింది. మాజీ చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు గత ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేసినప్పటి నుండి ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ పదవి దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా  ఉంది. మరో  సభ్యుని పదవి కూడా ఖాళీగా ఉంది.

ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యుడు, మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ప్రఫుల్లా పంత్ గత మార్చిలో ఈ ఖాళీలతో పాటు పలు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్లలో సహితం పలు పదవులు ఖాళీగా ఉన్న సమస్యను లేవనెత్తారు. దీనిని “ఆందోళన కలిగించే విషయం” అని పేర్కొన్నారు.

అనంతరం పంత్‌ను యాక్టింగ్ చైర్‌పర్సన్‌గా నియమించారు.  అనేక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు తక్కువ సిబ్బందితో ఉన్నాయి  ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ పలు రాష్ట్రాలలో మానవహక్కుల కార్యకర్తలు హైకోర్టులను ఆశ్రయించారు. 

ఉదాహరణకు,  కోవిద్-19 కారణంగా  దేశవ్యాప్తంగా లాక్ డౌన్  సమయంలో గత సంవత్సరం పెద్ద ఎత్తున వలస నిర్వాసితుల సమస్య తలెత్తిన మహారాష్ట్రలో 2018 నుండి పూర్తి సమయం చైర్‌పర్సన్‌ను లేరు. రెండు తెలుగు రాష్ట్రాలలో సహితం హైకోర్టులు ప్రశ్నిస్తే గాని మానవహక్కుల చైర్ పర్సన్, సభ్యులను నియమించలేదు.