కరొనాతో మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ దంపతుల మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌, ఆయన భార్య లక్ష్మి కరోనాతో మృతిచెందారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్‌ కుటుంబం మొత్తం కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడింది. భార్యాభర్తలిద్దరు తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. 

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించటంతో మంగళవారం వీరిద్దరు తుదిశ్వాస విడిచారు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరు మృతిచెందటం గమనార్హం. గతంలో కరోనా బారిన పడిన ఎస్వీ ప్రసాద్‌.. కోలుకున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు. కానీ, సెకండ్‌ వేవ్‌లో కుటుంబమంతటికీ కరోనా సోకింది. భార్య,  కుమారులతో కలిసి ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నప్పటికీ ఉపయోగం లేకపోయింది.

ఎస్వీ ప్రసాద్‌ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ  రమణ  సంతాపం తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్వీ ప్రసాద్‌ అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసిన ఎస్వీ ప్రసాద్‌ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. నెల్లూరు జిల్లా సబ్‌ కలెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. కడప, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అనేక శాఖలకు కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా సేవలందించారు.

2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఎస్వీ ప్రసాద్‌ ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల పేషీల్లో పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, ఎన్టీఆర్‌, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, చంద్రబాబు పేషీల్లో  12-13 ఏళ్లపాటు పనిచేసి రికార్డు సృష్టించారు.