
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు చెప్పింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ పనులు నిలిపివేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యంను అన్య మల్హోత్రా, సోహాని హష్మీ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఇందులో ప్రజా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదని, ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని అనడం గమనార్హం.
అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి కోర్టు ప్రస్తావిస్తూ పనులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్కడా లేదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్ట్ విశేషమైన ప్రజాప్రయోజనాలతో కూడుకున్నదని ప్రధాన న్యాయమూర్తి డి ఎన్ పటేల్, న్యాయమూర్తి జ్యోతి సింగ్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొన్నారు. పైగా ఈ సెంట్రల్ విస్టా అవెన్యూ పనులను సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో ఒక భాగంగా చూడాలని, వేరు చేసి చూడరాదని హితవు చెప్పింది.
ఈ కేసులో తీర్పును మే 17న హైకోర్టు రిజర్వులో ఉంచింది. పార్లమెంట్ కార్యక్రమాలు కూడా ఇక్కడి నుండే జరుగబోతాయని పేర్కొంటూ, ప్రజలు విశేష ఆసక్తి కలిగించే నిర్మాణం అని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ న్యాయబద్దతను ఇప్పటికే సుప్రీం కోర్ట్ సమర్ధించిన్నట్లు గుర్తు చేసింది.
కాంట్రాక్టు షెడ్యూల్ ప్రకారం సెంట్రల్ అవెన్యూ పనులను నవంబర్ నాటికి పూర్తి చేయవలసి ఉన్నాడని, పనులు చేస్తున్న సమయంలో కరోనా ప్రోటోకాల్ లు అన్నింటిని అమలు జరుపుతున్నప్పుడు కోర్ట్ జోక్యం చేసుకొని, పనులను నిలిపివేయవలసిన అవసరం లేదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు