సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్  పై దుష్ప్రచారం….  హర్‌దీప్ ఖండన 

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనంతో పాటు పలు భవన నిర్మాణాలు చేపట్టడం కోసం కొన్ని పాత భవనాలను కూల్చబోతున్నారని ప్రతిపక్షాలు, ఇతరులు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని  కేంద్ర భవన నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్  ఖండించారు. చారిత్రాక, సాంస్కృతిక, ఐకానిక్ భవనాలకు చిన్న హాని కూడా జరగనివ్వమని, వాటిని సురక్షితంగా కాపాడతామని ఆయన స్పష్టం చేశారు.
 
‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై అనేక అవాస్తవాల ప్రచారం జరుగుతున్నాయి. చారిత్రాక, సాంస్కృతిక, ఐకానిక్ భవనాలను తాకే ప్రసక్తే లేదు. రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లు సురక్షితంగా ఉంటాయి సెంట్రల్ విస్టాతో పాటు పార్లమెంట్ భవనం నిర్మాణంలో ఉన్నాయి. వాటిని అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తాం’’ అని వెల్లడించారు.
 
కాగా, ప్ర‌ధాన‌మంత్రి నివాసం(పీఎంఆర్‌) నిర్మాణ ప‌నులు ఆగ‌స్టులో మొద‌లుకానున్న‌ట్లు ఓ ప్ర‌ధాన ప‌త్రికలో వ‌చ్చిన క‌థ‌నాన్ని మంత్రి కొట్టిపారేశారు. ఆ కధనం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ పీఎం రెసిడెన్స్ డిజైన్‌కు సంబంధించిన తుది న‌మోనా త‌మ మంత్రిత్వ‌శాఖ‌కు ఇంకా అంద‌లేద‌ని మంత్రి హ‌రిదీప్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.
 
నిర్మాణ ప‌నులు మొద‌లు కాక‌ముందే డిజైన్‌ను ఫైన‌లైజ్ చేయాల‌ని, దానికి అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాతే టెండ‌ర్ల ద్వారా ప‌నులు కేటాయిస్తామ‌ని మంత్రి చెప్పారు. సుమారు 15 ఎక‌రాల్లో పీఎంఆర్‌ను నిర్మిస్తున్న‌ట్లు ఓ ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. పీఎంఆర్‌లో ప్ర‌ధాని నివాసంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం కూడా ఉంటుంది.
 
ప్ర‌స్తుతం రెండు కొత్త ప్రాజెక్టులు అమ‌లులో ఉన్నాయ‌ని, కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌తో పాటు సెంట్ర‌ల్ విస్టా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని హ‌ర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాధి రాక‌ముందే ఈ రెండు ప్రాజెక్టుల‌కు సంబంధించిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ  1300 కోట్లు ఖ‌ర్చు కానున్న‌ట్లు మంత్రి తెలిపారు.