50 రోజుల కనిష్టానికి కరోనా కేసులు 

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,52,734 కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత త‌క్కువగా న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు చేరాయి. ఇందులో 2,56,92,342 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 20,26,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 3,29,100 మంది మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణించారు. 

కాగా, నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 2,38,022 మంది వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గా, కొత్త‌గా 3128 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఈ నెల 4 త‌ర్వాత అతి త‌క్కువ మ‌ర‌ణాల సంఖ్య ఇదేన‌ని పేర్కొంది. రిక‌వ‌రీ రేటు 91.60 శాతానికి పెర‌గ‌గా, పాజిటివిటీ రేటు 9.04 శాతానికి త‌గ్గింద‌ని తెలిపింది.

ఇటీవల అత్యధికంగా కరోనా కేసులు నమోదైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అసోంల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో దేశంలో కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. 

 సింగల్ డోసు ప్రభావంపై పరిశీలన?

ఇలా ఉండగా,  దేశంలో వ్యాక్సిన్ సింగల్ డోసు ప్రభావంపై కేంద్రం అధ్యయనం చేయాలనుకుంటోంది. కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ ఫ్లాట్‌పామ్ నుంచి డేటాను సేకరించిన ప్రభుత్వం కోవిసీల్డ్ వ్యాక్సిన్ మోతాదుల మధ్య విరామాన్ని మరింత పెంచే అంశంపై సమీక్షించనుంది.
 
 దేశంలో జనవరి 16 నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రజలకు కోవిసీల్డ్ లేదా కోవ్యాక్సిన్ టీకా ఇస్తున్నారు. కొద్ది మందికి స్పుత్నిక్ వి ఇచ్చారు. మార్చి, ఏప్రిల్‌లో కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరంపై చర్చ ప్రారంభమైందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు.