మేఘాలయ సీఎం కన్వీనర్ గా కోవిడ్ ఉపసంఘం 

కోవిడ్-19 టీకాల‌తో స‌హా ఔష‌ధాలు, చికిత్సా ప‌రిక‌రాల‌పై ప‌న్ను మాఫీపై చ‌ర్చించేందుకు మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం (జీవోఎం) ఏర్పాటైంది. ఈ ఉప‌సంఘానికి మేఘాల‌య సీఎం క‌న్రాడ్ సంగ్మా క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

స‌భ్యులుగా గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్‌, గోవా ర‌వాణా, పంచాయ‌తీ రాజ్, హౌసింగ్ శాఖ మంత్రి మౌవిన్ గోడింహో, ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజ‌న్ పూజారి, తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హ‌రీష్ రావు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖ‌న్నా ఉంటారు.

కొవిడ్ వ్యాక్సిన్ల‌తోపాటు ఔష‌ధాలు, టెస్టింగ్ కిట్స్‌, మెడిక‌ల్ గ్రేడ్ ఆక్సిజ‌న్‌, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, జ‌న‌రేట‌ర్లు, వెంటిలేట‌ర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, స‌ర్జిక‌ల్ మాస్కులు, థ‌ర్మా మీట‌ర్లు త‌దిత‌ర ప‌రిక‌రాల‌పై ప‌న్ను మిన‌హాయింపు కావాల‌న్న అభ్య‌ర్థ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ప్ర‌స్తుతం వ్యాక్సిన్ల‌పై 5 శాతం జీఎస్టీ, డ్ర‌గ్స్‌, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌పై 12 శాతం లెవీ విధిస్తున్నారు. విదేశాల నుంచి వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం దిగుమ‌తి చేసుకున్న ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌పై 28 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించింది. కానీ వీటిని మాఫీ చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు.

శుక్ర‌వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో కొవిడ్‌-19 సంబంధిత వ‌స్తువుల‌పై జీఎస్టీ మాఫీపై ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. దీనిపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు.