బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై సుంకం మినహాయింపు 

బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై సుంకం మినహాయింపు 

ఈమధ్య బ్లాక్‌ ఫంగస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోకి దిగుమతయ్యే దాని ఔషధాలపై  జీఎస్టీ మండలి   సుంకం మినహాయింపునిచ్చింది. 7 నెలల విరామం అనంతరం శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 43వ జీఎస్టీ మండలి వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. 

 బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగిస్తున్న ఆంఫోటెరిసిన్‌-బీ దిగుమతులపై ఐజీఎస్టీ మినహాయింపునివ్వడంతో వీటి ధరలు తగ్గనున్నాయి.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు తాజా సమావేశంలో పాల్గొన్నారు.

కొవిడ్‌-19 వ్యాక్సిన్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీని మినహాయించాలన్న దానిపై ఈ జీఎస్టీ మండలి సమవేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఓ మంత్రుల బృందం వ్యాక్సిన్లు, ఇతర మెడికల్‌ ఉత్పత్తుల సరఫరాపై పన్ను నిర్మాణం గురించి చర్చిస్తుందని భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిర్మల తెలిపారు. 

పది రోజుల్లోగా లేదా వచ్చే నెల 8కల్లా ఓ నివేదికను ఈ మంత్రుల బృందం సమర్పిస్తుందని తెలియజేశారు. అలాగే విదేశాల నుంచి దిగుమతయ్యే కరోనా సంబంధిత ఔషధాలపై అవసరమైతే అన్నింటికీ ఐజీఎస్టీ మినహాయింపును కల్పిస్తామన్న సంకేతాలనిచ్చారు.

  • విదేశాల నుంచి కొనుగోలు చేసిన లేక ప్రభుత్వానికి, ఏదైనా స్వచ్చంధ సంస్థకు విరాళంగా వచ్చిన కరోనా సంబంధిత రిలీఫ్‌ వస్తూత్పత్తులకు ఈ ఏడాది ఆగస్టు 31దాకా ఐజీఎస్టీ మినహాయింపు
  • అమ్మకాలపై వసూలు చేస్తున్న పన్నుతో పోల్చితే, కొనుగోళ్లపై చెల్లిస్తున్న పన్నులు ఎక్కువగా ఉండటంపై చర్చలు
  • చిరు పన్ను చెల్లింపుదారులకు ఊరట. పెండింగ్‌ జీఎస్టీ రిటర్నుల దాఖలుకు అవకాశం. తప్పిన ఫీజుల భారం
  • రూ.1.58 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ రుణ నిధులను జీఎస్టీతో ఏర్పడిన ఆదాయ లోటు భర్తీకి రాష్ర్టాలకు ఇవ్వాలని నిర్ణయం.
  • జూలై 2022 తర్వాత రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని పొడిగించాలన్న దానిపై త్వరలో జీఎస్టీ మండలి ప్రత్యేక సమావేశం కానుంది.