2డీజీ డ్ర‌గ్ సాచెట్ ఖ‌రీదు రూ 990

డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్ స‌హ‌కారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్ర‌గ్ 2డీజీ సాచెట్ రూ 990కు అందుబాటులో ఉండ‌నుంది. పౌడ‌ర్ రూపంలో ల‌భించే ఈ మందును కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు డిస్కౌంట్ ధ‌ర‌పై స‌ర‌ఫ‌రా చేస్తారు.

ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌, ఆరోగ్య మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కొన్ని రోజుల క్రితం ఈ పౌడ‌ర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ 2డీజీ ఔషధానికి అనుమతినిచ్చింది.

క‌రోనా బారిన‌ప‌డి ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందే రోగుల్లో ఈ మందు వాడ‌కం స‌త్ఫ‌లితాలు ఇచ్చిన‌ట్టు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో వెల్ల‌డైంది. 2డీజీ వాడిన రోగులు త్వ‌ర‌గా కోలుకోవ‌డ‌మే కాకుండా, వారికి ఆక్స‌జ‌న్ అందించే అవ‌స‌రం గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్టు వెల్ల‌డైంది.

పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్‌ సోకిన కణాల్లోకి చేరుకుని,  ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్‌ వృద్ధి తగ్గిపోతుంది. వైర‌స్ మ‌ర‌న్ని క‌ణాల్లోకి వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకుంటుంది. ఆక్సిజ‌న్ పై ఆధార‌ప‌డి ద‌వాఖాన‌ల్లో చేరాల్సిన రోగుల‌కు ఈ మందు వ‌రంగా మార‌నుంది.

నిన్న పది వేల సాచెట్స్ విడుదల చేశారు. రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ ల్యాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లాయిడ్ స్సైన్సెస్ ఈ డ్రగ్ ను తయారు చేసింది. ఈ డ్రగ్ హాస్పిటల్ లో  చేరిన పేషంట్లు త్వరగా రికవరీ అయ్యేందుకు  ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

స్పుత్నిక్ వి టీకా రూ 1,195

కాగా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వి టీకాను దేశంలోని అన్ని అపోలో ఆసుపత్రులలో జూన్ రెండో వారం నుండి ఒకొక్క డోస్ ను రూ 1,195 ధరకు వేయనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. అందుకు అదనంగా రూ 200 పాలనా సంబంధ చార్జీలను వసూలు చేయనున్నారు. దేశంలో 80 ప్రదేశాలలో గల తమ ఆసుపత్రులలో 10 లక్షల టీకాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.