ప్రతి విషయం రాజకీయం చేస్తున్న కేజ్రీవాల్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. పాకిస్థాన్‌పై లక్షిత దాడులు జరిగినపుడు, ప్రస్తుతం కోవిడ్-19పై పోరాటం జరుగుతున్నపుడు ఆయన లక్ష్యం రాజకీయాలు చేయడమేనని ధ్వజమెత్తింది.

కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశం చేస్తున్న పోరాటంలోకి పాకిస్థాన్‌ను తీసుకొచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించడం పట్ల బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు తమ స్వంత ఆయుధాలను అభివృద్ధి చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసినపుడు సాక్ష్యాలు కావాలని కేజ్రీవాల్ అడిగారని గుర్తు చేశారు. కేజ్రీవాల్ వైఖరి శోచనీయమని, అప్పుడు కూడా రాజకీయాలే చేశారని గుర్తు చేసారు. ఢిల్లీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1.5 లక్షల వ్యాక్సిన్లు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.

కేజ్రీవాల్ వీటిని ప్రజలకు అందజేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబిత్ పాత్ర హితవు చెప్పారు. రోజుకు రెండు, మూడు విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసి, రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.

అంతకుముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాలు స్వయంగా వ్యాక్సిన్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. పాకిస్థాన్ దాడి చేస్తే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు తమ సొంత ఆయుధాలు, ట్యాంకులను కొనుక్కోవాలా? అని ప్రశ్నించారు.