వ్యాక్సిన్ల వృథాలో ముందంజలో జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ 

జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు అత్యధికంగా వ్యాక్సిన్లను వృథా చేస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఆరోపించింది. ప్రతి మూడింటి డోసులలో ఒక దాన్ని వృథా చేస్తున్నట్లు డేటాలో పేర్కొంది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉందని పేర్కొంటూ పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపివేయడం, నెమ్మదిగా ప్రక్రియ కొనసాగిస్తుండటంతో ఈ నివేదిక ఆందోళన కలిగిచ్చే అంశంగా మారింది. జార్ఖండ్‌ ఎక్కువగా వ్యాక్సిన్‌ వృథాకు పాల్పడుతున్న అంశంపౖౖె కేంద్రం స్పందిస్తూ ఒక వైపేమో కొన్ని రాష్ట్రాలు టీకాలు లేవంటూ ఫిర్యాదులు చేస్తుంటే, మరో వైపు మరికొన్ని రాష్ట్రాలు టీకాలను వ్యర్థం చేస్తున్నాయని పేర్కొంది. 
 
ఇక జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ అయితే కొన్ని అవాంతరాలు ఉన్నందున కోవిన్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేయడం లేదని చెబుతున్నారని తెలిపింది. జాతీయ సగటున 6.3 శాతం డోసులు వ్యర్థమౌతున్నాయని పేర్కొంది. 
 
టీకాలను ఒక శాతం కన్నా వృథా చేయరాదని రాష్ట్రాలకు చెబుతున్నప్పటికీ జార్ఖండ్‌ (37.3 శాతం), చత్తీస్‌గఢ్‌ (30.2 శాతం), తమిళనాడు (15.5 శాతం), జమ్ముకాశ్మీర్‌ (10.8 శాతం), మధ్యప్రదేశ్‌ (10.7 శాతం) వ్యర్థ పరుస్తున్నాయని వివరించింది.  అయితే తమ రాష్ట్రంలో కేవలం 4.56 శాతం టీకాలు మాత్రమే వృథా అయ్యాయని హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేశారు. సాంకేతిక ఇబ్బంది, అవాంతరాలు కారణంగా టీకాల డేటాను కోవిన్‌ పోర్టల్‌లో పొందుపరచలేదని, త్వరలో నవీనకరిస్తామని చెప్పారు.