చైనా-ఇయు పెట్టుబడుల ఒప్పందం నిలిపివేత 

చైనా-ఇయు సమగ్ర పెట్టుబడుల ఒప్పందాన్ని (సిఎఐ) స్తంభింపజేస్తూ యురోపియన్‌ పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనా, రష్యాలను వేరు చేసి, దాని ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇటీవల లండన్‌లో జరిగిన జిా7 విదేశాంగ మంత్రుల సమావేశం నిర్ణయించింది. 

2028 నాటికి చైనా అమెరికాను దాటి ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు ప్రకటించాయి. దీంతో చైనాను ఆర్థికంగా ఎదగనీయకుండా చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. జిా7 , నాటో కూటముల్లోని సభ్య దేశాలపై మరీ ముఖ్యంగా యూరోపియన్‌ దేశాలపై అది ఒత్తిడి తెస్తోంది. 

షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మానవ హక్కులను చైనా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ యురోపియన్‌ యూనియన్‌ చైనాపై ఆంక్షలు విధించింది. అందుకు ప్రతిగా చైనా ఎదురు ఆంక్షలు విధించింది. దీంతో సమస్య ఉత్పన్నమైంది. ఒప్పందాన్ని ధ్రువీకరించే చర్చలను స్తంభింపచేయాలని యురోపియన్‌ పార్లమెంట్‌ నిర్ణయించింది.

చైనా ఆంక్షల కారణంగానే ఈ వైఖరి తీసుకున్నామని యురోపియన్‌ పార్లమెంట్‌ కార్యాలయం గ్లోబల్‌ టైమ్స్‌కి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. చైనాా-ఇయు సమగ్ర పెట్టుబడుల ఒప్పందంపై ఇరు పక్షాలు ఏడేళ్ళపాటు చర్చలు జరిపాయి. ఇవి 2020 చివరిలో ముగిశాయి. 2022కల్లా ఒప్పందం ధ్రువీకరణ క్రమం పూర్తవాలని భావిస్తున్నట్లు ఇయు ఆనాడు పేర్కొంది. 

యురోపియన్‌ వాణిజ్య సంస్థలు చైనా మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ”తమకు తాము ప్రయోజనం చేకూర్చుకోకుండా ఎదుటివారికి హాని కలిగించేలా” ఈ చర్య వుందని చైనా అంతర్జాతీయ అధ్యయనాల సంస్థలో యురోపియన్‌ అధ్యయనాల విభాగానికి చెందిన డైరెక్టర్‌ హాంగ్జియాన్‌ వ్యాఖ్యానించారు. 

కాగా, రష్యాలో ప్రభుత్వ మార్పు జరగాలంటూ ఇయు మరో తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై యురోపియన్‌ పార్లమెంట్‌ ఇటీవల ముసాయిదా తీర్మానం రూపొందించింది.