స్టెరాయిడ్స్‌ తక్కువగా తీసుకోవాలి

కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ దేశ ప్రజలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కరోనా బాధితులు తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
కరోనా దుష్ప్రభావాలను నివారించేందుకు ప్రజలు అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్నారని, అయితే కరోనా బాధితులకు తక్కువ మొత్తంలో స్టెరాయిడ్స్‌ ఇవ్వాలని ఆయన వైద్యులకు సూచించారు. స్టెరాయిడ్స్‌ తక్కవగా వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
 
కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నప్పుడు ఐసిఎంఆర్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని మంత్రి చెప్పారు. కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న సమయంలో చికిత్స నియమాలను పాటించకపోవడం వల్ల కరోనాకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. తప్పని పరిస్థితుల్లోనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.