50 శాతం మంది మాస్కులు ధరించడం లేదు 

కరోనాను అడ్డుకోవాలంటే మాస్కులు పెట్టుకోండని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నాఇంకా ఇప్పటి వరకు 50 శాతం మంది మాస్కులు ధరించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  64 శాతం మంది పెట్టుకుంటున్నప్పటికీ ముక్కును కవర్‌చేయడం లేదని చెప్పారు. ఇవన్నీ ఓ అధ్యయనంలో తేలినట్లు పేర్కొన్నారు.
 
లక్షకు పైగా యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాలు ఎనిమిది ఉన్నాయని, 50 వేల నుండి లక్ష మధ్య యాక్టివ్‌ కేసులున్నవి తొమ్మిది రాష్ట్రాలున్నాయని తెలిపారు. 50 వేలకు లోపు యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాలు 19 ఉ న్నాయని వెల్లడించారు.  కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపారు.
కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లో 25 శాతానికి పైగా పాజిటివీ ఉందని, ఇది ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయని మే 29- మే 5 మధ్యలో 210 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని, మే 13-19 మధ్యలో ఆ జిల్లాల సంఖ్య 303 పెరిగిందని వివరించారు. కాగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1,97,70,555 వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
రాబోయే మూడు రోజుల్లో మరో 25,98,760 డోసులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వివరించింది.  దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 21,07,31,130 వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో 19,09,60,575 డోసులు వినియోగించుకున్నట్లు గురువారం వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం 54,53,386 వ్యాక్సిన్‌ డోసులను వినియోగించుకోగా, ఇందులో తొలి డోసును 43,86,757 మంది, రెండో డోసును10,66,629 మంది వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.