గడ్చిరోలిలో 13 మంది మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లా పేడి-కొటమి ఎటపల్లి అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర సి-60 విభాగానికి చెందిన ప్రత్యేక సాయుధ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గాలిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.
ఈ ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారని గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండున్నర గంటలకు పైగా జరిగిన ఈ కాల్పులలో 50 నుండి 60 మంది మావోయిస్టులు పాలొన్నట్లు చెబుతున్నారు.
ఘటనాస్థలంలో తుపాకులను, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ లో మరింతమంది మావోయిస్టులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అదే జిల్లాలో మొత్తం మీద రూ 43 లక్షల రివార్డులు గల ఐదుగురు  మావోయిస్టులను కాల్పులలో చంపిన రెండు నెలలకు ఈ కాల్పులు జరిగాయి.