జూన్ నుంచి కరోనా మరణాలు తగ్గుముఖం

జూన్ నుంచి దేశంలో రోజువారీ కొవిడ్ మరణాల సంఖ్య తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. జులై చివరి నాటికి సెకండ్ వేవ్ ముగుస్తుందని భావిస్తున్నారు. ధర్డ్‌వేవ్ ఆరు నెలల తరువాత తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ ప్యానెల్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య సైంటిస్టుల కమిటీ పరిస్థితిని సమీక్షించుకుని పలు అంశాలపై నిర్థారణకు వచ్చింది.

కేంద్ర శాస్త్రవ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సైన్ అండ్ టెక్నాలజీ విభాగం పరిధిలో సైంటిస్టు ల ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే మహారాష్ట్ర, యుపి, కర్నాటక, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కేసులు ఉధృత స్థాయికి చేరాయి. మరికొన్ని రాష్ట్రాలలో ఈ సంఖ్య పెరుగుతుంది. మొత్తం మీద జులై చివరికి సెకండ్ వేవ్ ముగుస్తుందని కమిటీ తెలిపింది.

ఇక వ్యాక్సిన్ల విషయంలో ఇప్పటి స్తబ్థత వీడుతుంది. త్వరలోనే వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతుంది. కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే వచ్చే నెల నుంచి మరణాల రేటు తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

అయితే గత 24 గంటల అధికారిక గణాంకాలలో ప్రపంచవ్యాప్త కొవిడ్ మరణాలలో రోజువారి స్థాయిలో భారత్ లో  అత్యధిక మరణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో వ్యాక్సిన్ల అందుబాటును పెంచడంపైనే భారత ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే నెలలో లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులు జరిగితే వ్యాక్సినేషన్ల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.

మే 7వ తేదీన దేశంలో రోజువారి కేసుల సంఖ్య అత్యధికంగా 4.14 లక్షలకు చేరింది. దీనితో ఆందోళన పెరిగింది. అయితే తరువాతి దశలో ఇటీవలి రోజులలో కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ నెల 18న రోజువారి కేసుల సంఖ్య 2.63 లక్షలకు చేరింది. గత 7 రోజుల లెక్కలో కేసుల సంఖ్యలో 3.1 శాతం తగ్గుదల నమోదు అయింది. అయితే రోజువారీ మరణాలు సంఖ్య 18వ తేదీన అత్యధికంగా 4529కు చేరింది.

వైరస్‌తీవ్రస్థాయితో మరణాల సంఖ్య తగ్గకపోవడం విషమ పరిస్థితి కొనసాగింపుగానే మారింది. అమెరికాలో ఈ ఏడాది జనవరిలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఒక్కరోజే 4409 మంది కరోనాతో మృతి చెందారు. ఈ సంఖ్యను దాటుతూ భారత్‌లో ఒక్కరోజు కరోనా మరణాలు నమోదు అయ్యాయి. జూన్‌లో వరుసగా పలు వ్యాక్సిన్ల పంపిణీ జోరందుకుంటుంది.

సీరం ఇనిస్టూట్, భారత్ బయోటెక్ నుంచి టీకాల సరఫరాలు కేంద్రానికి రాష్ట్రానిక మరింత ఎక్కువ అవుతాయి. జూన్‌లో రోజువారిగా కనీసం పాతిక లక్షల డోస్‌ల టీకాలు వేయడం జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు పలు ప్రాంతాలలో లాక్‌డౌన్లు ఉండటం వల్ల వ్యాక్సినేషన్‌ల ప్రక్రియకు ఇబ్బంది ఏర్పడుతోంది.

ప్రజలు ప్రస్తుత పరిస్థితిలో దూర ప్రాంతాలకు వెళ్లి టీకాలు వేయించుకోవడానికి భయపడుతున్నారు. మరో వైపు టీకాలు సరైన కోటాలో అందకపోవడం తీవ్ర స్థాయిలో చిక్కులు తెచ్చిపెడుతోంది. పలు చోట్ల వ్యాక్సినేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నారు. అయితే ఇటువంటి అవరోధాలు వచ్చే రెండు మూడు వారాలలో సమసిపోతాయని, ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయితే కరోనా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నారు.