డీఏపీపై రాయితీ రూ.700 పెంపు

డీఏపీ ఎరువుల మీద రాయితీని కేంద్రప్రభుత్వం 140% పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.500 రాయితీని రూ.1200 చేసింది. అంటే కొత్తగా రూ.700 రాయితీని పెంచింది. రైతుల ఎరువులకిచ్చే సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.80,000 కోట్లమేర ఖర్చు చేస్తోంది. తాజాగా డిఎపి సబ్సిడీని పెంచడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో కేంద్రంపై రూ.14,775 కోట్లమేర అదనపు భారం పడనున్నది.

రాయితీ పెరిగినప్పటికీ ప్రస్తుత ధరల్లో మార్పు ఉండదు. ఇప్పుడు మార్కెట్‌లో డీఏపీకి ఉన్న ధరలే ఇకముందు కూడా ఉంటాయి. అంతర్జాతీయంగా డీఏపీ ధరలు పెరగడంతో భారత్ లో  కూడా పెరిగాయి. ఆ పెరిగిన భారం రైతులపై పడకుండా ఉండేందకు కేంద్రం రాయితీని పెంచింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

‘డీఏపీ ఎరువుల బస్తాపైన రాయితీని రూ.500 నుంచి రూ.1200కు పెంచాలని నిర్ణయించారు. దీంతో డీఏపీ ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.1200కే ఇక ముందు కూడా లభిస్తుంది’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ ధరలు పెరిగినప్పటికీ ఆ భారం రైతులపై పడకూడదని ప్రధాన మంత్రి నిర్ణయించడంతో గతంలో ఎన్నడూ లేనంత భారీగా సబ్సిడీ ప్రకటించారు. ఎరువుల కంపెనీలు ధరలను గణనీయంగా పెంచడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

ఏప్రిల్ 8న ఇఫ్కో డిఎపి 50 కిలోల బ్యాగ్ రిటైల్ ధరను రూ 1,200 నుండి రూ 1,900కు, అంటే 58 శాతం పెంచింది. ఈ ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఎరువుల ధరలను “సమంజసం”గా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

డిఎపిలో వినియ్హయోగించే ఫాస్ఫారిక్ ఆసిడ్, అమోనియా అంతర్జాతీయ ధరలు ఈ మధ్య 60 శాతం నుండి 70 శాతం పెరిగాయి. ఎరువుల కంపెనీల డిఎపి ధర వాస్తవంగా బ్యాగ్ రూ 2,400 కాగా, రూ 500 సబ్సిడీ మినహాయించి రూ 1,900కు అమ్ముతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ పెంచడంతో రూ 1,200 కు అమ్మవలసి ఉంటుంది.