కర్ణాటక లాక్‌డౌన్ బాధితుల కోసం రూ. 1250 కోట్లు 

కరోనా వైరస్ విజృంభణ కారణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన వారికి సహాయం నిమిత్తం రూ. 1250 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప  ప్రకటించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ ఈనెల 24న ముగియనున్న దరిమిలా దీన్ని పొడిగించడంపై ఒకరోజు ముందుగా నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

కొవిడ్ ఫస్ట్ వేవ్ కాలంలో వివిధ రంగాలకు చెందిన వారికి ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు, రైతుల జీవనోపాధిపై ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వారిని ఆదుకోవడానికి రూ. 1250 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందచేయనున్నామని  ఆయన తెలిపారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తమకు ఉన్న ఆర్థిక పరిమితుల దృష్టా చేయగలిగినంత చేస్తున్నామని, అవసరమైతే భవిష్యత్తులో మరింత సహాయాన్ని అందచేస్తామని ఆయన తెలిపారు.

కర్నాటక ప్రభుత్వం తొలుత ఏప్రిల్  27 నుంచి 14 రోజుల క్లోజ్డ్ డౌన్ ప్రకటించింది. కాగా, కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చడంతో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది.