గుజరాత్‌ తీరం తాకిన తౌటేతుఫాన్‌

మూడు రోజుల పాటు పశ్చిమ తీరాన్ని చిగురుటాకులా వణికించి బీభత్సం సృష్టించిన తౌటే తుఫాను సోమవారం రాత్రి 9 గంటలకు గుజరాత్‌ తీరం తాకింది. తుపాన్ ప్రభావం వల్ల డియూ,అమ్రేలి, భావనగర్, బోటాడ్, అహ్మదాబాద్, గాంధీనగర్, మెహసన, సబర్ కాంత, బాణాస్ కాంత ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షం కురుస్తోంది.

తుపాన్ ప్రభావం వల్ల ముందుజాగ్రత్తగా సూరత్ నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సూరత్ కు రాకపోకలు సాగించాల్సిన విమానసర్వీసులను రద్దు చేశారు. అంతకుముందు అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టించింది. సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అలల ధాటికి ముంబైలో రెండు భారీ నౌకలు లంగరు తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయాయి. రెండు నౌకల్లో కలిపి 410 మంది సిబ్బంది ఉన్నారు.

భారత నౌకాదళం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. మూడు యుద్ధ నౌకలను (ఐఎన్‌ఎస్‌ కొచ్చి, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ తల్వార్‌) రంగంలోకి దింపింది. బాంబే హై ప్రాంతంలోని హీరా అయిల్‌ ఫీల్డ్స్‌ నుంచి కొట్టుకుపోయిన పీ305 నౌకను వెతకడానికి ఐఎన్‌ఎస్‌ కొచ్చి నౌక బయల్దేరింది.

పీ305లో 273 మంది ఉన్నారు. జీఏఎల్‌ కన్‌స్ట్రక్టర్‌కు చెందిన మరో నౌకలో 137 మంది ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి వీరిలో 38 మందిని రక్షించినట్టు నేవీ అధికారులు తెలిపారు. ముంబైలో చరిత్రలోనే అత్యధికంగా గంటలకు 114కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో భారీ నష్టం సంభవించింది.