టివి 5, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి లపై కూడా సిఐడి కేసు 

పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారంటూ ఏపీ సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన  నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు కేసులో రెండు న్యూస్ ఛానల్స్ పై కూడా కేసు నమోదు చేశారు. 

ఆయనపై నమోదు చేసిన  ఎఫ్‌ఐఆర్‌ లో ఎ 1గా  రఘురామకృష్ణరాజును పేర్కొనగా, ఎ 2గా టీవీ5, ఎ 3గా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. రామకృష్ణరాజుతో తరచూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ, ఆయనకు తమ ఛానల్స్ లో సమయం ఇచ్చారని వారిపై ప్రధాన ఆరోపణ. 

సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేష్టలు ఉన్నాయని తెలిపింది. కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని, టీవీ5, ఎబిఎన్ లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొంది. టీవీ5, ఏబీఎన్‌ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మించాయని సీఐడీ తెలిపింది.

పక్కా పథకం ప్రకారమే రఘురామ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. రఘురామకృష్ణరాజు, న్యూస్ ఛానల్స్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు సీఆర్పీసీ   124 (ఎ) సెక్షన్‌, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (బి) ఐపీసీ సెక్షన్‌, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (సి), బెదిరింపులకు పాల్పడినందుకు సీఆర్పీసీ  505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.