హైదరాబాద్‌పై ఏపీకి ఇప్పటికీ సంపూర్ణ హక్కులు

వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దులో అడ్డుకోవడంపై బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అంశాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. 
 
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌పై ఇప్పటికీ సంపూర్ణ హక్కులున్నట్టు వీర్రాజు స్పష్టం చేశారు. అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో రెండు నిండు ప్రాణాలు పోయాయని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలని సోము వీర్రాజు చెప్పారు.
 
కాగా,  ఎపీ నుంచి తెలంగాణ వెళ్లే అంబులెన్సులను అడ్డుకోవడం అంటే ఏపీ ప్రజల రాజ్యాంగ, చట్టపరమైన హక్కులను తుంగలో తొక్కేయడమేనని బీజేపీ నేత లంకా దినకర్‌ విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, సెక్షన్‌ 5 ప్రకారం, హైదరాబాద్‌ 10 సంవత్సరాల, అంటే 2 జూన్‌ 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టు ఆంబులెన్సులను అడ్డుకోవద్దని స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ అడ్డుకోవడం దారుణమని మండిపడ్డాయిరు. సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లపాటు కొనసాగించేందుకు చట్టసవరణ అవసరమని దినకర్‌ కోరారు.