బ్రిటన్‌లో జీరో కరోనా మరణాలు

గత ఏడాది కరోనా సృష్టించిన ప్రళయంతో చిగురుటాకులా వణికిపోయిన బ్రిటన్ ఒక వైపు  కఠిన ఆంక్షలను ఒకవైపు కొనసాగిస్తూనే.. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో యుద్ధకార్యచరణను అమలు చేయడం ద్వారా కరోనా మరణాలకు కళ్లెం వేయగలిగింది. 

బ్రిటన్‌లో తొలిసారిగా ఎటువంటి కరోనా మరణాలు చోటుచేసుకోలేదు. గతేడాది మార్చి నుంచి పరిశీలిస్తే సోమవారం తొలిసారిగా ఇంగ్లాండ్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లో జీరో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒకవైపు కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్లు ఉప్పెనలా విరుచుకుపడుతున్నా.. మరణాలను ఈ స్థాయిలో కట్టడి చేయడం గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. కఠినమైన లాక్‌డౌన్‌ అమలు, వ్యాక్సినేషన్‌లో కొత్త వ్యూహాలే ఈ విజయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

మరణాల్లో తగ్గుదలకు టీకాల ప్రభావమే కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ ఇడెన్‌బర్గ్‌కు చెందిన ప్రొఫెసర్‌ రౌలాండ్‌ కౌ పేర్కొన్నారు.వచ్చే ఆగస్టు నాటికి బ్రిటన్‌ కరోనా రహిత దేశంగా మారబోతున్నదని వ్యాక్సిన్‌ కార్యదళం చీఫ్‌ క్లివ్‌ డిక్స్‌ ప్రకటించడాన్ని చూస్తే, అక్కడ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎంత పకడ్బందీగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

 ‘ప్రస్తుతం బ్రిటన్‌లో నమోదవుతున్న కరోనా కేసులు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, వారి శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండటంతో మరణాలు తగ్గిపోయాయి’ అని రౌలాండ్‌ కౌ వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇన్ఫెక్షన్‌ శాతం, మరణాలు గణనీయంగా తగ్గడంతో ఆంక్షలను క్రమంగా సడలించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.

బ్రిటన్‌ జనాభా 6.7 కోట్లు. అర్హులైన ప్రతి వంద మందిలో ఎనభై మందికి ఇప్పటికే అక్కడ టీకాను (5.3 కోట్ల డోసులు పూర్తి) వేశారంటే ఆ దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎంత వేగంగా నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. టీకాలను వేయడంలో కూడా బ్రిటన్‌ కొత్త వ్యూహాలను అమలు చేసింది. 

గతేడాది మార్చి నుంచి దేశంలో కరోనాతో మరణించిన వారి రికార్డులను పరిశీలించి.. జనాభాను కొవిడ్‌-19 ప్రమాదకర గ్రూప్‌ 1, 2, 3గా విభజించింది. గ్రూప్‌ 1లో ఉన్నవారు వైరస్‌కు త్వరగా ప్రభావితం అయ్యేవారని అర్థం. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆ గ్రూప్‌ వారి నుంచి మొదలు పెట్టింది. 

ఇలా 50 ఏండ్లు పైబడి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ముందుగా టీకాను వేశారు. అలాగే మొదటి డోసు తీసుకున్న వారు విధిగా రెండో డోసును వేసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల్లో కోత విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పూర్తి డోసులను వేసుకోవడానికి ప్రజలు ముందుకొచ్చారు.

వ్యాక్సిన్ల కొరత ఉండకుండా ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, మోడెర్నా తదితర టీకాల నిల్వలను పెద్దఎత్తున సిద్ధం చేశారు. ఇలా గ్రూప్‌ 2, 3 వారికి సైతం త్వరితగతిన టీకాలు వేశారు. అలాగే, పూర్తి వ్యాక్సిన్‌ డోసులు వేసుకున్నాక కూడా వైరస్‌ ప్రభావానికి గురయ్యే ప్రమాదమున్న వారి కోసం బూస్టర్‌ డోసు వేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.