భారత్ కు ముంచుకొస్తున్న తౌక్టే తుపాను ముప్పు

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, మరికొద్ది రోజుల్లో తుపాన్‌ వచ్చే సంకేతాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, బలపడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.ఒకవేళ ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్‌ అవుతుందని పేర్కొన్నారు. 
 
ఈ తుఫాన్‌కు తౌక్టే అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్‌, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఈ నెల 14 నుంచి సముద్రంలో వేటకు వెళ్లకూడదు అని హెచ్చరించారు.

తుపాన్‌ ప్రభావంతో మాల్దీవులు, లక్షద్వీప్‌లలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వారాంతంలో ఇక్కడి సముద్రంలో ఒక మీటరు ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తుపాన్‌ ఏ దిశను తీసుకుంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని, అల్పపీడన తీవ్రతను వాతావరణ శాఖ నిశితంగా గమనిస్తోందని అన్నారు. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.