ఇక ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కేటీఆర్!

ఈటెల రాజేంద్రను మంత్రివర్గం నుండి తొలగించి, ఆయన వద్ద గల ఆరోగ్య శాఖను తనవద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఆ శాఖ పర్యవేక్షణ బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పచెప్పారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సిన్‌, బాధితుల వైద్యానికి మందులు, ప్రాణాల రక్షణకు ఆక్సిజన్‌ కొరత రాకుండా రోజువారీగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం  ఏర్పాటుచేసింది. 

పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్‌ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి ఈ టాస్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రానికి రోజువారీగా ఎంత ఆక్సిజన్‌ అవసరం అవుతున్నదో దవాఖానలవారీగా లెక్కలు తీసి, ఆ మేరకు సరఫరాను మెరుగుపరిచే కార్యక్రమాన్ని టాస్క్‌ఫోర్స్‌ చేపట్టనున్నది. రాష్ట్ర అవసరాల కోసం అవసరమైతే కేంద్రంతో మాట్లాడి అదనంగా వచ్చేలా సమన్వయంచేసుకొనే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించనున్నది.

అదే విధంగా, రాష్ట్రంలో వాక్సినేషన్‌ను కూడా త్వరగా పూర్తిచేయడం కోసం రాష్ర్టానికి రోజువారీగా వచ్చే కోటా ఎక్కువగా ఉండేలా మానిటరింగ్‌ చేయడం, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో మాట్లాడి నేరుగా రాష్ర్టానికి కావాల్సిన వ్యాక్సిన్‌ వచ్చేలా చేసే బాధ్యతలను టాస్క్‌ఫోర్స్‌ చేపడుతుంది. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇప్పటికే గ్లోబల్‌ టెండర్లను పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్‌ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ఈ టాస్క్‌ఫోర్స్‌ మానిటరింగ్‌ చేయనున్నది.

కరోనా మందుల బ్లాక్‌ దందాలను అరికట్టి, ప్ర భుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత లేకుండా ఈ టాస్క్‌ఫోర్స్‌ రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేయనున్నది. మెడికల్‌ కిట్ల సరఫరాలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూస్తుంది. రోజువారీగా మందుల కొనుగోలు, సరఫరా, పంపిణీపై టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేకంగా మానిటరింగ్‌ చేయనున్నది.

గత ఏడాది కరోనా మహమ్మారి ప్రారంభమైన తొలి రోజులలో సమర్ధవంతంగా నిబంధనలను కఠినంగా అమలు జరుపుతూ, కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఈటెల రాజేంద్రకు పేరు వచ్చింది.

 అయితే ఆ తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాలను అనధికారికంగా కేటీఆర్ చేపట్టడం  ప్రారంభించి లాక్ డౌన్ నిబంధనలను నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. కరోనా టెస్ట్ లను తగ్గించి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారాలకు కొంతకాలం దూరంగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు మొత్తం ఆయన పర్యవేక్షణ కిందకు తెచ్చుకున్నట్లు అయింది.