కరొనతో మావోయిస్టు అగ్రనేతల మృతి!

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లా ద‌క్ష‌ణి బ‌స్త‌ర్ అడవుల్లో క‌రోనాతో కొందరు అగ్రనేతలతో సహా  10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ వెల్ల‌డించారు. మ‌రో 100 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆమె  తెలిపారు.

 క‌రోనా సోక‌డం, క‌లుషిత ఆహారం తిన‌డంతో మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. క‌రోనాతో చ‌నిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే మృతి చెందిన మావోయిస్టుల పేర్లు వెల్ల‌డి కాలేదు.

దండకారణ్య ప్రత్యేక జనల్ కమిటీ (డీకేఎస్‌జీసీ) సభ్యురాలు సుజాత తీవ్రమైన కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడిందని, శ్వాస సమస్యతో కదలలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోందని ఆమె పేర్కొన్నారు.  మావోయిస్టుల ప్రాణాలకు రిస్క్‌ ఉండటమే కాకుండా కరోనా వ్యాప్తితో గ్రామస్థుల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

గడువుతీరిన ఆహారం తీసుకోవడం వల్ల మరికొందరు మావోయిస్టులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడినట్టు తెలుస్తోందని ఆమె చెప్పారు. ఇక కుంట‌, డోర్న‌పాల్ ఏరియాల్లో మావోయిస్టులు క‌రోనా వ్యాక్సిన్‌తో పాటు దానికి సంబంధించిన ఔష‌దాల‌ను దొంగిలించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

క‌రోనా సోకిన వారిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌ ఉన్నట్టు సమాచారం. కొవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ‌ హామీ ఇచ్చారు.