ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆమె భర్త, వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిక్షిత్‌ రాజుకు కూడా కరోనా సోకింది.

 క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీదేవి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింద‌ని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు.

కాగా, తిరుపతి రుయా దవాఖానలో సకాలంలో ఆక్సిజన్‌ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృతిచెందారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల 11 మంది కరోనా రోగులు మృతిచెందారని చిత్తూరు కలెక్టర్‌ ప్రకటించారు. శ్రీపెరంబదూర్‌ నుంచి దవాఖానకు చేరుకోవాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు.

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కోవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన పట్ల  గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను గవర్నర్ ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం  కొత్తగా 14,968 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 16,167 మంది చికిత్సకు కోలుకున్నారు. 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 13,02,589కి పెరిగాయి. 11,04,431 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 1,89,367కు చేరాయి. 8791 మంది మృతి చెందారు.