ఢిల్లీ, యూపీల్లో లాక్‌డౌన్ పొడిగింపు

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లలో అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ మ‌రో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌. ఈసారి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌తరం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. మెట్రో స‌ర్వీసుల‌ను కూడా ర‌ద్దు చేశారు. 
 
ఈ నెల 17 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. కొవిడ్ కేసులు కొద్దిగా త‌గ్గినా.. మ‌ధ్య‌లో వ‌దిలేయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఏప్రిల్‌లో మ‌ధ్య‌లో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండగా.. ఇప్పుడ‌ది 23 శాతానికి వచ్చింది. ఇది కూడా చాలా ఎక్కువే అని, వ్యాప్తిని మ‌రింత అరిక‌ట్టాల్సిందేన‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వ‌ర‌కు పొడ‌గించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు యూపీ ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. మే 14 న పంచాయతీ ఎన్నికలు, అనంత‌రం రంజాన్‌ పండుగ తర్వాత గ్రామాల్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ను పొడ‌గించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. 

తొలుత‌ ఏప్రిల్ 29 న వారాంత‌పు బంద్ చేప‌ట్టారు. తర్వాత దానిని మే 4, మే 6 వ‌రకు, ఆ తర్వాత మే 10 వరకు పొడ‌గించారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం మళ్ళీ కరోనా కర్ఫ్యూను మే 17 న ఉదయం 7 గంటల వరకు పొడిగించింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీం -9 తో ఆదివారం జరిపిన సమీక్ష సమావేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా ఇన్‌ఫెక్ష‌న్ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కరోనా కర్ఫ్యూను మరోసారి మే 17 న ఉదయం ఏడు గంటల వ‌ర‌కు పొడిగించారు. ఈ సమయంలో అన్ని ఆంక్షలు మునుపటిలాగే అమలులో ఉంటాయని, అవసరమైన సేవలకు మినహాయింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.