అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వా శర్మ

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిస్వా శర్మ పదవి చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ నేతగా  హిమంత ఎన్నికైనట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. 
 
ఈ సమావేశానికి  బీజేపీ ప‌రిశీల‌కులుగా తోమార్‌తోపాటు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్ సింగ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా సీఎం రేసులో ఉన్న స‌ర్బానంద సోనోవాలే.. హిమంత బిశ్వ శ‌ర్మ పేరును ప్ర‌తిపాదించారు. ఈ సమావేశంలో అస్సాం బీజేపీ ఇన్‌ఛార్జి బైజయంత్ పాండా కూడా పాల్గొన్నారు.
 
సోమవారం హిమంత బిశ్వా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం సీనియర్‌ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడిన విషయం తెలిసిందే గత ప్రభుత్వంలో సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా, శర్మ ఆర్ధిక, విద్య,  ఆరోగ్యశాఖల మంత్రిగా పనిచేశారు. 
 
మరో వైపు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్‌ 6 సీట్లు దక్కించుకున్నాయి.
 
2001 నుంచి 2015 వరకు జలుక్బరి నియోజకవర్గం నంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు హిమంత. తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు. గత ఐదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ వ్యవహారాలలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఎన్డీయేకు అనుబంధంగా స్థానిక ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.