బెంగాల్‌లో హింసపై 30 దేశాల్లో నిరసనలు

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నట్లు బీజేపీ తెలిపింది. హింసకు పాల్పడుతున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని 30కి పైగా దేశాల్లోని ప్రవాస భారతీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించింది.

బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండ వల్ల  ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మమత బెనర్జీ కనుసన్నల్లో పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింస రాష్ట్రానికి అపఖ్యాతిని తీసుకొస్తోందని విచారం వ్యక్తం చేశారు. 

దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోందని తెలిపారు. దాదాపు ఐదు ఖండాల్లోని 30 దేశాల్లో ఉన్న సుమారు 50కి పైగా నగరాల్లో ప్రవాస భారతీయులు, బెంగాలీలు  పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. హింసాకాండకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 

వివిధ దేశాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల ఫొటోలను ఆయన షేర్ చేశారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు మే రెండున వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల హింస చెలరేగింది. ఈ హింసాకాండలో తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపించింది.