పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!

కొంత కాలంగా అజ్ఞాతంలో ఉంటూ వస్తున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయనను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రామగుండం తరలించినట్లు తెలుస్తోంది.

కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు ‘గాయబ్‌’ అయ్యారు. ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండగా, పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది.

మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా మెలగడంతోపాటు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది.

ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారని వార్తలు వినిపించగా, తాజాగా భీమవరంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం.

అయితే వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారా లేదా వేరే ఇతర కేసులో విచారిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా పెద్దపల్లికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీనును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.