బెంగాల్ అల్ల‌ర్ల‌లో 21 మంది మృతి

ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల అనంత‌ర అల్ల‌ర్ల‌లో 21 మంది మ‌ర‌ణించార‌ని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి పాల‌క టీఎంసీ కార్య‌క‌ర్త‌లు త‌మ పార్టీ మ‌ద్ద‌తుదారులు, స‌భ్యుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని ఆరోపించారు. 

ఎన్నిక‌లు జ‌రిగిన స్ధానాల్లో దాదాపు స‌గం నియోజ‌క‌వ‌ర్గాల్లో హింసాకాండ ప్ర‌జ్వ‌రిల్లింద‌ని చెప్పారు. హోంమంత్రిత్వ శాఖ నిజ‌నిర్ధార‌ణ టీం ప్ర‌తినిధుల‌ను తాము క‌లిశామ‌ని, అల్ల‌ర్లు జ‌రిగిన ప్రాంతాల‌ను సంద‌ర్శించాల్సిందిగా కోరామ‌ని తెలిపారు.

మ‌రోవైపు బెంగాల్ లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, హ‌త్యాయ‌త్నాలు పెచ్చుమీరాయ‌ని బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ఆరోపించారు. కేంద్ర మంత్రి కాన్వాయ్ పైనే దాడి జ‌ర‌గ‌డం బెంగాల్ ప‌రిస్ధితికి అద్దం ప‌డుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

 ‘‘పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయి. ఒక కేంద్ర మంత్రి పైనే దాడి జరిగితే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటి?..’’ అని ఆయన ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ‘‘టీఎంసీ ప్రేరేపిత’’ హింస తీవ్ర స్థాయిలో పెరిగిందని మండిపడ్డారు. 

బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయనీ.. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నారని నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 

ఒక కేంద్ర మంత్రికే ర‌క్ష‌ణ లేక‌పోతే బెంగాల్‌లో ఎవరైనా సుర‌క్షితంగా ఉండ‌గ‌ల‌రా అని కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ప్ర‌శ్నించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో కేంద్ర మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్ కాన్వాయ్‌పై స్థానికులు రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసిన ఘ‌ట‌న‌ను ఆయ‌న ఖండించారు. ఇది రాష్ట్రం ప్రేరేపిస్తున్న హింస అని ఆరోపించారు. నిందితుల‌ను చ‌ట్టం ద్వారా శిక్షించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌ డిమాండ్ చేశారు.