భారత్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్నందున దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరు తగ్గకుండా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరారు.
లాక్ డౌన్ లు అమల్లో ఉన్నా ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకాడరాదని, వ్యాక్సినేషన్ డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని వేరే విధులకు మళ్లించరాదని సూచించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రాలకు సహకరించాలని అధికారులు, కేంద్ర మంత్రులను కోరారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయని ప్రధానికి అధికారులు వివరించారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల వివరాలను నివేదించారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందుల లభ్యతను ప్రధాని సమీక్షించారు. రెమ్డిసివిర్ సహా కరోనా ఔషధాల ఉత్పత్తిని పెంచినట్టు అధికారులు ప్రధానికి వివరించారు.
రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల పెంపు గురించి కూడా మోదీకి అధికారులు వివరించారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి పరిపూర్ణంగా, వేగంగా తీసుకోవలసిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. సమస్యాత్మక జిల్లాలను గుర్తించాలని రాష్ట్రాలను కోరాలని మోదీ చెప్పారు.
10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను, ఆక్సిజన్ లేదా ఐసీయూ బెడ్స్ 60 శాతానికి పైగా నిండిన జిల్లాలను సమస్యాత్మక జిల్లాలుగా పరిగణించాలని రాష్ట్రాలకు తెలియజేయాలని చెప్పారు. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా మోదీ సమీక్షించారు. రాష్ట్రాలకు 17.7 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు అధికారులు మోదీకి తెలిపారు. 45 ఏళ్ళ వయసు పైబడినవారిలో సుమారు 31 శాతం మంది కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్లు వృథా అవుతున్న తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్ చురుగ్గా జరగాలని, ఈ వేగాన్ని తగ్గించకూడదని రాష్ట్రాలకు చెప్పాలని మోదీ ఆదేశించారు. అష్ట దిగ్బంధనాలు అమల్లో ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌కు అంతరాయం కలుగకూడదని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో పాల్గొనే హెల్త్‌కేర్ వర్కర్లను వేరొక విధులకు మళ్ళించరాదని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మల సీతారామన్, డాక్టర్ హర్షవర్ధన్, పీయూష్ గోయల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్