హైద‌రాబాద్ జూలో 8 సింహాల‌కు క‌రోనా 

హైద‌రాబాద్ జూలో 8 సింహాల‌కు క‌రోనా 

దేశంలోనే తొలిసారిగా జంతువులు క‌రోనా బారిన ప‌డ్డాయి. అది ఎక్క‌డో కాదు.. మ‌న హైద‌రాబాద్ నెహ్రూ జూపార్కులోనే. నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని ఎనిమిది ఆసియా సింహాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని జూ అధికారులు స్ప‌ష్టం చేశారు.

సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. ఎనిమిది సింహాలకు సంబంధించిన కొవిడ్‌ పరీక్షల నివేదికలు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌చ్చిన‌ట్లు జూ అధికారులు పేర్కొన్నారు.

పా‌ర్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. దీంతో వాటి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం సీసీఎంబీకి పంపారు.  సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారిన ప‌డ్డాయి.

దేశంలో పెరుగుతున్న కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్‌తో పాటు పలు పార్క్‌లను అధికారులు మూసివేశారు.

వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సింహాలు మహమ్మారి బారినపడడం దేశంలోనే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత హాంగాంగ్‌లో కుక్కలు, పిల్లుల్లో వైరస్‌ లక్షణాలను గుర్తించారు.